తెలంగాణపై టిడిపి డబుల్ గేమ్?

 

కేసీఆర్ తెదేపా, దాని అధ్యక్షుడి ద్వంద వైఖరిని ఎండ గట్టారు. తెలంగాణాకి అనుకూలంగా లేఖ ఇచ్చామంటున్న చంద్రబాబు, ఇకనయినా తన ద్వంద వైఖరికి స్వస్తి చెప్పి త్వరలో హైదరాబాదులో నిర్వహించనున్న మహానాడు సమావేశాలలో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రానికి తమ పార్టీ అనుకూలమని స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేసారు. తెలంగాణపై తన అభిప్రాయం స్పష్టం చేయకుండా చంద్రబాబు ఎన్ని పాదయాత్రలు చేసినా కూడా ఆ పార్టీ వచ్చే ఎన్నికలలో తెలంగాణా ఒక్క సీటు కూడా గెలుచుకోలేదని ఆయన అన్నారు.

 

ఈ విషయంలో కేసీఆర్ చెప్పిన మాటలు చేదుగా అనిపించినప్పటికీ అవి నూటికి నూరు శాతం నిజమని అంగీకరించక తప్పదు. తెలంగాణాలో చంద్రబాబు పాదయాత్ర వల్ల పార్టీ బలపడినప్పటికీ, అది ఆపార్టీకి అవసరమయినన్నిఓట్లు రాల్చకపోవచ్చును.

 

తెదేపా, వైకాపాలు రెండూ కూడా తెలంగాణాకు పూర్తి అనుకూలం కానప్పటికీ, అలాగని వ్యతిరేఖం కూడా కాదనేది సుస్పష్టం. తెలంగాణా విషయంలో అవి ఇప్పటికీ స్పష్టత ఈయకపోవడానికి ప్రధాన కారణం, అవి స్పష్టత ఇస్తే దానిని బట్టి కాంగ్రెస్ పార్టీ తన వ్యూహం మార్చుకొని, తమను రాబోయే ఎన్నికలలో ఎక్కడ దెబ్బ తీస్తుదనో భయం తప్ప మరొకటి కాదు. ఒకవేళ తాము ప్రత్యేక తెలంగాణా అంటే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ సమర్దుడయిన తెలంగాణా వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించి ‘సమైక్య రాష్ట్రం’ గేం ఆడితే, అప్పుడు రెండు ప్రాంతాలలో తమ పార్టీలు ఓడిపోతాయనే భయంతోనే ఆ రెండు పార్టీలు ఇంతవరకు స్పష్టత ఈయలేకపోతున్నాయి.

 

ఈ బలహీనత గురించి తెరాసకు కూడా బాగానే తెలుసు. అయితే అది తెలియనట్లుగా ఉండటమే తమకి రాజకీయంగా మేలు చేస్తుంది గనుక, తెలంగాణా అంశంపై స్పష్టత ఇవ్వాలని పట్టుబడుతోంది. తెదేపా ఈ పరిస్థితుల్లో ఎలాగు నిర్ద్వంద ప్రకటన చేయలేదని కూడా బాగా తెలుసు గనుకనే, తెలంగాణాకి అనుకూలమని ప్రకటన చేయమంటూ ఆపార్టీపై ఒత్తిడి తెస్తూ, దానికి వారు చెప్పే డొంక తిరుగుడు సమాధానాలను కేసీఆర్ తన శైలిలో తెలంగాణా ప్రజల ముందు ఉంచుతూ తెదేపాను, చంద్రబాబుని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు కూడా.

 

అయితే, తెలంగాణా అంశంపై తెదేపా స్పష్టత ఇవ్వడం వలన జరిగే నష్టం కంటే, ఇవ్వకపోవడం వలననే జరిగే నష్టమే ఎక్కువని చెప్పవచ్చును. ఆ పార్టీకి చెందిన తెలంగాణా నేతలు ఇప్పటికీ ప్రజల మద్య దైర్యంగా తిరుగలేకపోవడానికి ప్రధాన కారణం పార్టీ అనుసరిస్తున్న ఈ ద్వంద వైఖరే. తెలంగాణాకి తాము వ్యతిరేఖం కాదని చెప్పినపటికీ, ‘జై తెలంగాణా!’ అని కూడా అనలేని కారణంగా తెదేపా అక్కడి ప్రజల నమ్మకం పొందలేకపోతోంది.

 

వారి అనుమానాలను కేసీఆర్ తన వాక్చాతుర్యంతో మరింత బలపరుస్తున్నారు. ఈ సంగతి చంద్రబాబు తో సహా అందరికీ స్పష్టంగా తెలుసు కానీ తమ బలహీనతే తమ కాళ్ళకి బంధంగా మారడంతో నోరు మెదపలేకపోతున్నారు. ఒకవేళ ఆ పార్టీ గనుక తెలంగాణాపై స్పష్టమయిన వైఖరి ప్రకటించి ఉంటే, ఇప్పుడు ఆ పార్టీకి అక్కడ ఉన్న బలం ఖచ్చితంగా రెట్టింపు అయ్యేది. కానీ, ఆ తరువాత కాంగ్రెస్ పన్నే పద్మవ్యూహంలో ఎక్కడ చిక్కడిపోతామనే భయంతోనే స్పష్టత ఈయలేకపోతున్నారు.

 

అయితే, ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాల ప్రజల మద్య కేసీఆర్ ఆయన అనుచరులు తమ విద్వేషా ప్రసంగాలతో ఎప్పుడో చిచ్చుపెట్టి, వారి మద్య దూరం పెంచారు. కనుక, ఇక ఈ రెండు ప్రాంతాల ప్రజలు మానసికంగా కూడా ఎప్పుడో విడిపోయారు. ఒకవేళ తెలంగాణా వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవిలో కూర్చొబెట్టి వారిని మళ్ళీ కలుపుదామని ప్రయత్నాలు చేసినా కూడా ఇటువంటి రాజకీయనాయకులు ఉద్యమాలలో ఉన్నంత కాలం తిరిగి కలిసే అవకాశం ఉండదు.

 

ఇటువంటి వాస్తవిక ధోరణిలో ఆలోచించి ఉంటే తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండూ కూడా తెలంగాణాకి అనుకూలంగా స్పష్టమయిన ప్రకటన చేసి, రెండు ప్రాంతాలలో ప్రత్యేక శాఖలు ఏర్పరుచుకొని, కాంగ్రెస్ తెరాసలకు దీటుగా నిలబడగలిగేవి.

 

కానీ, ముందే చెప్పుకొన్నట్లు కాంగ్రెస్ వ్యూహానికి బయపడుతూ, తెలంగాణా సమస్యను పరిష్కరించే బాధ్యతని కాంగ్రెస్ పార్టీపైకి నెట్టేసి దాని భుజాల మీద తమ తుపాకులు ఉంచి రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో విజయం సాదించాలని ఆలోచన చేస్తున్నాయి. అయితే, ఈ ద్వంద విధానం వలన ఆ రెండు పార్టీలకి తెలంగాణా ప్రాంతంలో లాభం కంటే నష్టమే ఎక్కువ కలుగుతుంది.

 

ఈ విషయంలో స్పష్టత ఇచ్చిన బీజేపీ మరియు కమ్యునిస్ట్ పార్టీలు రెండూ కూడా రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలలో ప్రజల నుండి వ్యతిరేఖత ఎదుర్కోనలేదనే సంగతిని ఆ రెండు పార్టీలు గమనిస్తే, తాము తెలంగాణాకి అనుకూలమని ప్రకటించినా కూడా ఆంధ్రా ప్రాంత ప్రజలు వ్యతిరేకించరనే సంగతి అర్ధం అవుతుంది.

 

ఒకవేళ వ్యతిరేకిస్తే వారి ప్రత్యర్ద రాజకీయ పార్టీల నేతలు, వారిచే ప్రేరింపబడిన అనుచరులే వ్యతిరేకిస్తారు తప్ప ప్రజలు కారు. అటువంటప్పుడు వారిని రాజకీయంగా ఏవిధంగా ఎదుర్కోవాలో ఆలోచించుకొని, ముందుకు సాగడం మేలు. ఏమయినప్పటికీ చంద్రబాబు తన ద్వంద విధానాల వల్ల రెండు ప్రాంతాల ప్రజల నమ్మకం పోగొట్టుకొంటున్నారని ఖచ్చితంగా చెప్పవచ్చును.