మహానాడుతో తెదేపా అందోళనలతో వైకాపా బిజీ

 

తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు నేటినుండే రెండు రోజుల పాటు సమావేశాలు, ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. కాకతాళీయంగా ఒకే సమయంలో జరుగుతున్న ఆ రెండు పార్టీల కార్యక్రమాలు వేర్వేరు ఆలోచనలతో నిర్వహింపబడుతున్నట్లు పైకి కనిపిస్తున్నపటికీ, వాటి అంతిమ లక్ష్యాలు మాత్రం ఒక్కటే! రాబోయే ఎన్నికలకి పార్టీని సిద్దం చేసుకోవడం.

 

తొమ్మిది ఏళ్ళుగా ప్రతిపక్ష బెంచీలకు అంకితమయిపోయిన తెదేపా, మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలను ఎదుర్కోనున్నందున, పార్టీ విజయం సాధించడానికి తగిన వ్యూహ రచనలు చేసుకోవడం ఈ రెండు రోజుల మహానాడు ప్రధాన ఉద్దేశ్యం.

 

ఇక, అక్రమాస్తుల కేసులో అరెస్ట్ కాబడిన జగన్ మోహన్ రెడ్డి జైలులో నిర్బంధించబడి నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా వైకాపా రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు నిరసనలు, ఆందోళనలు చేపడుతోంది. రాబోయే ఎన్నికలలోగా అయన జైలు నుండి విడుదల అనుమానంగా ఉన్నందున, ఈ సందర్భంగా ఆందోళనలు నిర్వహించి ప్రజలలో జగన్ పట్ల సానుభూతి మరింత పెంచుకొని, అంతిమంగా దానిని ఓట్ల రూపంలోకి మార్చుకోవాలని వైకాపా ఆలోచన.

 

రాబోయే ఎన్నికలు తేదేపాకు జీవన్మరణ సమస్య వంటివి గనుక ఆ అగ్నిపరీక్షలో తన సర్వ శక్తులు ధారపోసి విజయం సాదించేందుకు అవసరమయిన ఆయుధాలను ఈ సమావేశాలలో సిద్దం చేసుకోబోతోంది. ఆ ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు పాదయాత్రలో ప్రజలకు చేసిన వాగ్దానాన్నిటికీ ఆమోదం తెలుపుతూ ఈ సమావేశాలలో ఒక తీర్మానం ఆమోదించనున్నారు.

 

అదే విధంగా తెలంగాణా అంశంపై స్పష్టమయిన ఒక ప్రకటన చేయాలని కేసీఆర్ విసిరిన సవాలుని స్వీకరించి, తెలంగాణాపై మరికొంత స్పష్టత ఇచ్చి ఆ ప్రాంతంపై కూడా తిరిగిపట్టు సాధించాలని తెదేపా ఆశిస్తోంది.

 

ఇక, దూకుడు మీద ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన నిత్య నూతన పధకాలతో ప్రజలలో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేఖ భావనల తీవ్రతను క్రమంగా తగ్గించి, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను తారుమారు చేసే ప్రయత్నాలు గట్టిగానే చేస్తునందున ఆయనను ఎదుర్కోవడానికి తగిన వ్యూహాలు సిద్దం చేసుకోవాల్సి ఉందని తెదేపా గ్రహించింది.

 

ఇక, క్రిందటి సారి ఎన్నికలలో తమ విజయానికి చిరంజీవి సైంధవుడిలా అడ్డుపడితే, రాబోయే ఎన్నికలలో జగన్ మోహన్ రెడ్డి అడ్డుపడబోతున్నాడని గ్రహించిన తెదేపా, అతనిని ఎదుర్కొనేందుకు తగిన వ్యుహాలను సిద్దం చేసుకోకతప్పదు.

 

అయితే, సాదారణంగా ఇటువంటి కార్యక్రమాలను తన బల ప్రదర్శనకు మాత్రమే ఉపయోగించుకొనే తెదేపా, ఊక దంపుడు ప్రసంగాలు, విపక్షాలపై విమర్శలు, ఏవో కొన్ని మొక్కుబడి తీర్మానాలతో తన సహజ సిద్దమయిన ఆర్భాట ప్రదర్శనకే ఈ వేదికను ఉపయోగించు కొనే అవకాశం ఉంది.

 

వైకాపా కోటి సంతకాల కార్యక్రమయినా, విజయమ్మ రచ్చబండ కార్యక్రమయినా, షర్మిల పాదయాత్రయినా, నేటి నిరసన కార్యక్రమలయినా అన్నిటి ప్రధాన లక్ష్యం అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటూ అక్రమాస్తుల కేసులో జైలులో నిర్బందించబడ్డ జగన్ మోహన్ రెడ్డి పట్ల ప్రజలలో వ్యతిరేఖ భావనలు ఏర్పడనీయకుండా జాగ్రత్త పడుతూ, ఆయన నిష్కలంక చరితుడు, ప్రజల కోసం పోరాడటం వలనే జైలుకి వెళ్ళిన ఒక మహాయోధుడు, స్వర్గీయ వైయస్సార్ పధకాలను అమలుచేయగల ఏకైక వ్యక్తి అనే సానుకూల భావనలు వ్యాపింపజేసి ప్రజలలో సానుభూతి కొనసాగేలా చేయడమే.

 

ఇక సైన్యాధ్యక్షుడు లేకుండా ఎన్నికల రణరంగంలో అడుగుపెట్టబోతున్న వైకాపా, ఇదే విషయాన్ని తన కార్యకర్తలకి అర్ధం అయ్యేట్లు తెలియజేసి వారిని మానసికంగా సిద్దం చేయడం, అదే సమయంలో జగన్ పట్ల ప్రజలలో సానుభూతిని మరికొంత పెంచడం ఈ రెండు రోజుల కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యాలు.

 

ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో ఆ రెండు రాజకీయ పార్టీలు తమకు అందుబాటులో ఉన్న ఇటువంటి సందర్భాలను తమకనుకూలంగా వినియోగించుకోవడం సహజమే. కానీ, వాటి ప్రయత్నాలు అవి ఎంతవరకు సఫలం అయ్యాయనే సంగతిని ఎన్నికలలో విజయమే తేలుస్తుంది.