బ్రదర్ పై మైనార్టీ అస్త్రం ప్రయోగించిన తెదేపా

 

అవిశ్వాస తీర్మానాన్ని అడ్డంపెట్టుకొని తనను ఇరికించజూస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై తెలుగుదేశం పార్టీ, కొత్తగా తన అమ్ముల పొదిలో జేరిన మైనార్టీ అస్త్రం ప్రయోగించింది. గతనెల గుంటూరు జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర చేస్తున్న సమయంలో ఏర్పరిచిన తెదేపా అనుబంధ క్రీస్టియన్ సంఘం అద్యక్షుడు శాంతారాం డేవిడ్ ద్వారా వైయస్సార్ కుటుంబ సభ్యుడయిన బ్రదర్ అనిల్ కుమార్ పై తెలుగుదేశం పార్టీ దాడి చేసింది. తద్వారా తమను అవిశ్వాసం తీర్మానం మిషతో ఇబ్బందులు పెడితే, అందుకు ఆ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తెలియజేసింది.

 

తెదేపా అనుబంధ క్రీస్టియన్ సంఘం అద్యక్షుడు శాంతారాం డేవిడ్ నిన్న పార్టీ కార్యాలయం యన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. రాజశేఖర్ రెడ్డి, ఆయన అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేసారు.

 

స్వర్గీయ డా. రాజశేఖర్ రెడ్డి క్రీస్టియన్ మతస్తుడయినప్పటికీ ఆయన క్రీస్టియన్ ప్రజలకు పెద్దగా చేసిందేమీ లేదని, రాష్ట్రంలో క్రీస్టియన్ మతస్తులకు సరిపోయినన్ని శ్మశానాలు కూడా లేక చాలా ఇబ్బాదులు పడుతున్నామని, శ్మశానాల కోసం స్థలాలు కేటాయించమని తాము ఇచ్చిన వినతి పత్రాలను కూడా పట్టించుకోకుండా వాటిని ఆయన చెత్తబుట్టలో పడేశారని ఆవేదన వ్యక్తం చేసారు. తమకి కనీసం శ్మశానాల కోసం స్థలాలు కూడా కేటాయించలేని ఆ పెద్దమనిషి తన అల్లుడు అనిల్ కుమార్ గనుల కోసం బయ్యారంలో లక్షలాది ఎకరాల స్థలం, మణికొండలో విలువయిన ప్రభుత్వ భూములు అప్పనంగా కట్టబెట్టేరని విమర్శించారు.

 

తరువాత బ్రదర్ అనిల్ కుమార్ పై తీవ్రఆరోపణలు చేస్తూ “గతంలో మా మతానికి చెందిన వారు అనేకమంది బ్రదర్ అనిల్ కుమార్ ను హైదరాబాద్, సోమాజిగూడా వద్దగల ఎలైట్ భవనంలో ఉన్న బెనేట కార్యాలయంలోనే కలిసేవారని, బేనేట సంస్థకు ఆయనే అసలు యజమాని అని చెప్పడానికి ఇంతకంటే ప్రత్యేకంగా ఏమి రుజువులు కావాలని ప్రశ్నించారు. ఇటీవల అనుమానస్పద స్థితిలో మరణించిన బెనిటా గనుల సంస్థ యజమానిగా చెప్పబడుతున్న వీరభద్రారెడ్డికి బ్రదర్ అనిల్ కు మద్య ఏమి సంబంధం ఉందో తెలుసుకోవాలని పోలీసులు కనిపెట్టాలని, అదేవిధంగా వీరభద్రారెడ్డి మరణం వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుందో, ఆయన చనిపోయే ముందు ఎవరెవరికి ఫోన్ కాల్స్ చేసారో, తన తదనంతరం ఎవరెవరికి బేనేట సంస్థ చెందేట్లు ఏర్పాట్లు చేసేరో వంటి విషయాలను పోలీసులు దర్యాప్తుచేసి కనిపెట్టాలని శాంతారాం డేవిడ్ డిమాండ్ చేసారు.

 

ఆయన చేసిన ఆరోపణలకు త్వరలోనే బ్రదర్ అనిల్ లేదా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తగిన జవాబు ఇస్తారని వేరే చెప్పనవసరం లేదు. కానీ ఈరాజకీయ ఎత్తుగడ గమనిస్తే, రాజకీయ పార్టీలు మైనార్టీ, మహిళా, విద్యార్ధి, వెనుకబడిన కులాల అనుబంధ విభాగాలను ఎందుకు స్థాపిస్తాయో అర్ధం అవుతుంది. సదరు వర్గానికి చెందిన ఓటు బ్యాంకును గెలుచుకోవడానికి మాత్రమే కాకుండా, అవసరమయినప్పుడు ఈవిధంగా వైరి పక్షాలలో సదరు వర్గాలను ఆవర్గానికి చెందిన వారి చేతనే దాడిచేయించే వెసులుబాటు ఉంటుంది. తద్వారా ఒక వైపు తమ వైరి పక్షంలో ఆవర్గానికి చెందిన నేతలపై దాడి చేసే వెసులుబాటు పొందుతూనే, మరో పక్క న్యాయపరమయిన కేసులు తమ తలకి చుట్టుకోకుండా తప్పించుకొనే వెసులుబాటు కూడా ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు ఈవిధంగా అనుబంధ సంస్థలను ప్రోత్సాహిస్తున్నాయి. తద్వారా తాము సంబందిత వర్గానికి చాలా ప్రాదాన్యం ఇస్తున్నామని ప్రచారం చేసుకొనే గొప్ప అవకాశం కూడా పొందగలుగుతున్నాయి.

 

కానీ, యదార్ధ పరిస్థితులు చూసినట్లయితే అవన్నీ సదరు పార్టీల అమ్ముల పొదిలో అస్త్రాలుగా మాత్రమే మిగిలిపోతున్నాయని అర్ధం అవుతుంది. ఏమయినప్పటికీ, సదరు అనుబంధ సంఘాలలో పనిచేసేవారు కూడా మారిన సామాజిక పరిస్థితుల్లో నేడు ఏదో ఒక బలమయిన రాజకీయ పార్టీ అండదండలు ఉండటం అవసరమనో లేక రాజకీయంగా ఎదిగాలనే ఆలోచనలతో వివిధ రాజకీయ పార్టీల వెనుక తిరుగుతున్నారు. అయితే, వారికి సదరు రాజకీయ పార్టీలు ఏవిదం సాయం చేస్తాయో లేదో ఖచ్చితంగా చెప్పలేకపోయినా, వారిని ఉపయోగించుకొని ఒకే వర్గానికి చెందిన ప్రజల మద్య చిచ్చు మాత్రం పెట్టగలవని ఖచ్చితంగా చెప్పవచ్చును.