ఎవడండీ ప్రధాని.. వాడికి ఎంత ధైర్యం..!

 

ప్రధాని మోడీని ఫ్లోలో గాడు అన్నందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎంత బద్నాం చేశారో తెలిసిందే. ప్రధాని అంతటి వ్యక్తిని గాడు అని అంటావా అని కొందరు.. మోడీని గాడు అని సంబోధించినందుకు కేసీఆర్ ను జైల్లో కూడా పెట్టాలని మరికొంతమంది బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. మరి మాములుగానే కేసీఆర్ ప్రతిపక్షనేతలను కూరలో కరివేపాకులాగా తీసిపారేస్తుంటారు. అలాంటిది తనను అన్ని మాటలు అంటుంటే చూస్తూ ఊరుకుంటారా..? బీజేపీ నేతలు తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించి..ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని.. నాలాంటి వాళ్ల దగ్గర కొస్తే భస్మం అయిపోతారాని...అయినా ప్రధానిని ఏం అనకూడదని ఏమన్న రాజ్యాంగంలో రాసుందా..? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే..ఇక్కడ మరో వ్యక్తి కూడా కోపంతో మోడీని ఆడు అని సంబోధించారు. ఆయన ఎవరో కాదు.. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పే..సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్.

 

ఇటీవల నేను 29సార్లు ఢిల్లీ వెళ్లినా మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని చంద్రబాబు ఓ చెప్పుకుంటున్న సంగతి తెలిసందే. దీనిపైనే ఓ మీడియా ఛానెల్ లో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..  ‘ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 29సార్లు ఢిల్లీకి వెళితే.. మోడీ అపాయింట్‌ మెంట్ ఇవ్వలేదట. ఇది ఎంత దారుణం.. దీన్ని ఎవరైనా చెప్పుకుంటారా? నిజంగా చంద్రబాబుకి ఆత్మగౌరవం ఉండి ఉంటే ఒకసారి రెండుసార్లు చూసి అప్పుడే ఎన్డీఏకి గుడ్‌బై చెప్పి బయటకు వచ్చేసి ఉండాల్సింది..' అని భరద్వాజ అభిప్రాయపడ్డారు. అంతేకాదు మోడీపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.  29 సార్లు మా ముఖ్యమంత్రి వెళితే పట్టించుకోరా? ఎవడండీ ప్రధాన మంత్రి?.. సీఎంని లోపలికి రానీయకుండా ఉండటానికి.. వాడికి ఎంత ధైర్యం ఉండాలి? ప్రధాన మంత్రి ఎంత గొప్పోడైనా కావచ్చు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇలా అవమానిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఏడాదిన్నర కాలం మా ముఖ్యమంత్రిని లోపలికి రానీయకుండా చేశారంటే ఏమనాలి? ఆ ముఖ్యమంత్రి ఎవరు? మేం ఓటేసి గెలిపించుకున్నాం.. ఆయన్ని అవమానించారంటే.. ఆ అవమానం ఆయనొక్కరిదే కాదు.. మమ్మల్నీ అవమానించినట్టే. మాకు జరిగిన ఈ అవమానానికి నువ్ ఏం సమాధానం చెప్తావ్?.. అంటూ ప్రధానిని ప్రశ్నించారు. మరి కేసీఆర్ గాడు అన్నందుకు బీజేపీ నేతలు అంతలా విరుచుకుపడ్డారు. మరి ఇప్పుడు భరద్వాజ గారు ఏకంగా.... వాడు, వీడు అనే సంబోధించారు. మరి దీనిపై ఎంత దుమారం రేగుతుందో చూడాలి.