పోలీసులు ఒక్క గంట పాటు సమ్మె చేస్తే, మీ పరిస్థితేంటి?


అదేదో సినిమాలో ఒక హీరో అంటాడు, నాకు ఒక గంట సమయం ఇవ్వండి, లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ లో పెడతా అని. మరి, అదే పోలీసులు ఒక గంట తమ విధుల్ని బహిష్కరించి కేవలం ఒక గంట పాటు సమ్మె చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహకు కూడా అందదు. ఇవన్నీ ఇప్పుడెందుకు చెప్పాల్సి వస్తుందంటే, మద్రాస్ హై కోర్ట్ తమిళనాడు ప్రభుత్వంపై సూటి ప్రశ్నలతో విరుచుకుపడింది. అసలు విషయం ఏంటంటే, ఒక వారం రోజుల వ్యవధిలో పని వత్తిడి కారణంగా తమిళనాడులో ఒక ఎస్సై మరియు కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రంలో పోలీసు సిబ్బంది యొక్క దయనీయమయిన పరిస్థితులను వివరించడానికి న్యాయవాది పురుషోత్తమన్ ఒక పిటిషన్ వేయగా, జస్టిస్ కిరుబాకరన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు అగ్రశ్రేణి పోలీసులను తీవ్రంగా విమర్శించారు.

జయలలిత మరణించినప్పటికీ ఆమె నివాసం వద్ద అంత మంది పోలీసుల్ని ఎందుకు కాపలా పెట్టినట్లు? ఖాళీ బంగళాలు, సమాధులు, స్మారక మందిరాలు కాపలా కాసేందుకా పోలీసులుండేది? మంత్రులు కార్లలో తిరుగుతుంటే, పోలీసులు వాళ్ళ ఇళ్ల దగ్గర కుక్కల్లా కాపలా కాయలా?” అంటూ ఆయన అసహనం వ్యక్త పరిచారు. అసలు పోలీసులు ఒక గంట పాటు సమ్మె చేస్తే తమిళనాడు భవితవ్యం ఏంటో ఊహించుకోండి అని హెచ్చరించారు. జస్టిస్ కిరుబాకరన్ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాట సంచలనం గా మారాయి.