‌మెరీనా బీచ్‌‌‌తో.. మోడీకి ముప్పేనా..?

దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు ప్రత్యేకం..తమ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా..తాము భారతదేశంలోనే విలక్షణమైన జాతిగా అక్కడి ప్రజలు భావిస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే ఆచార వ్యవహారాలు, వస్త్ర ధారణ, కట్టుబాట్లు అన్ని కూడా తమిళనాడులో విభిన్నంగా కనిపిస్తాయి..అలాగే వారి పోరాట పోటిమ, ఆలోచనా తీరు కూడా వేరుగా ఉంటుంది. ఒక స్ఫష్టమైన లక్ష్యసాధన కోసం పార్టీలు, విధానాలు, వర్గాలు, అంతర్గత వైషమ్యాలన్నింటిని పక్కనబెట్టి నడుం బిగించారంటే ఎంతటి వారైనా దిగి రావాల్సిందే..స్వతంత్ర భారత చరిత్రలో ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది. ద్రావిడ అధిపత్య సాధనకు ఏళ్ళ తరబడి పోరాడారు..రాష్ట్రంలో హిందీ శబ్ధం వినబడకుండా..కనీసం రెండో భాషగా కూడా వాడుకలో లేకుండా తరిమికొట్టారు. ఈ ఐకమత్యమే వారిని విజయ తీరం వైపు చేరేలా చేస్తోంది. ఈ సంఘటిత శక్తే ప్రభుత్వాలను వణికింపజేసింది. తాజాగా ఈ ముప్పు ప్రధాని నరేంద్రమోడీని తాకనుంది.

 

ప్రధానిగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మోడీ సరైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంది లేదు. పటేల్ ఉద్యమం, గో రక్షకుల దాడి, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో రైతుల ఆందోళనలను సమర్థవంతంగా అడ్డుకోగలిగింది కేంద్ర ప్రభుత్వం. కానీ తమిళనాట త్వరలో రాబోతున్న ముప్పును ఎదుర్కోవడం మోడీకి అంత సులభం కాదు. కరువు సాయం కోరుతూ గత ఏప్రిల్‌లో దేశరాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వివిధ రూపాల్లో ఆందోళన చేస్తూ మోడీకి ముచ్చెమటలు పట్టించారు. చీరలు కట్టుకోవడం, పుర్రెలు, ఎముకలతో సుమారు నెల రోజుల పాటు నిరసన వ్యక్తం చేశారు. అయితే స్వయంగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి రంగంలోకి దిగి హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కానీ మూడు నెలలు గడుస్తున్నా వీరిని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు స్పందించడం లేదు.

 

దీంతో తమిళ యువత రంగంలోకి దిగింది. తమకు ఎంతో కలిసివచ్చి..జల్లికట్టు ఉద్యమంలో విజయాన్ని అందించిన చెన్నై మెరీనా బీచ్‌లో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టుబోతోంది అన్న వార్త ఇప్పుడు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ..ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న రైతులకు మద్ధతుగా మెరీనా బీచ్‌కు తరలిరావాలంటూ ఫేస్‌బుక్చ వాట్సాప్‌లలో మెసేజ్‌లు షేర్ అవుతుండటంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. మెరీనా బీచ్ పరిసరాలకి వస్తున్న ప్రజలు ఆపి, వారిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తీరంలోకి అనుమతిస్తున్నారు.

 

ఇప్పటికే మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో రైతు వ్యతిరేక ఉద్యమాలు జరిగి నివురుగప్పిన నిప్పులా ఉన్న పరిస్థితుల్లో తమిళనాట మరో రైతు ఉద్యమం జరిగితే అది ప్రధాని నరేంద్రమోడీకి తీవ్ర ఇబ్బందులు కలగజేస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..ఎందుకుంటే మిగిలిన ప్రాంతాల్లో ఉద్యమాలను అణిచినట్లు తమిళనాడులో సాధ్యం కాదు..ఆ విషయం మోడీకి కూడా తెలుసు..ఈ నేపథ్యంలో రైతులను శాంతింప చేయటం అన్ని విధాలా మంచిది. లేదంటే తమిళ రైతుల స్పూర్తిని అందుకుని మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఆందోళనలు జరిగే అవకాశం లేకపోలేదు..