ప్రజాస్వామ్యానికి... చిన్నమ్మ నేర్పిన (గుణ)పాఠాలేంటి?

 

తమిళనాడు హై డ్రామాకు తెరపడింది! శశికళ పన్నీర్ సెల్వం చేత రాజీనామా చేయించటంతో మొదలైన రాజకీయ జల్లికట్టు పళని స్వామి బలనిరూపణతో, స్టాలిన్ చిరిగిన చొక్కాతో ముగింపుకొ్చ్చింది. తమిళనాడులో పరిస్థితులు ఇప్పుడప్పుడే చక్కబడే అవకాశం లేకున్నా మిగతా రాష్ట్రాల వారికి మాత్రం బ్రేకింగ్ న్యూస్ ల వరద ఇకపై తగ్గిపోతుంది. పన్నీర్ అమ్మాడీఎంకే, శశికళ తమిళనాడు జైలుకి వచ్చే ప్రయత్నాలు, డీఎంకే జనాందోళనలు.... ఇలా ఇక రొటీన్ గా కథ సాగిపోతుంది. కాని, ఈ మొత్తం వ్యవహారం నిరూపించింది ఏంటి? చాలానే వుంది...

 

తమిళనాడే కాదు... మన దేశంలో చాలా చోట్ల, చాలా పార్టీలు అన్నాడీఎంకే లాంటి దుస్థితిలోనే వున్నాయి. ఎవరో ఒక సినీ, రాజకీయ హీరో ఓ పార్టీ పెడతాడు. ఆయన మొత్తం దళాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని రాజ్యమేలుతాడు. ప్రజాస్వామ్య పార్టీలైనప్పటికీ వీటిలో ఎలాంటి అంతర్గత ప్రజాస్వామ్యం వుండదు. ఒక వ్యక్తి ఇమేజో, ఒక కుటుంబమో మొత్తమంతా వ్యవహారం నడుపుతుంది. కాశ్మీర్ లోని నేషనల్ కాన్ఫరెన్స్ , పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలు మొదలు తమిళనాడు డీఎంకే, అన్నాడీఎంకేల వరకూ అన్నీ ఇదే కోవలోకి వస్తాయి. విషాదంగా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కూడా ఒక కుటుంబానికే స్వంత ఆస్తిగా మారిపోయింది. దాని ఫలితమే... విపరీత సంక్షోభాలు. బీజేపి, కమ్యూనిస్ట్ పార్టీల తరహాలో నాయకత్వం లభించకపోవటం ఈ పార్టీల కష్టాలకి, వాట్ని ఆదరించిన రాష్ట్రాల నష్టాలకి కారణం! ఇప్పుడు జయలలిత మరణం తరువాత ఏఐఏడీఎంకే పరిస్థితి లాంటిదే మాయావతి బీఎస్పీ పార్టీకి, మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ కి రాదని గ్యారెంటీ ఏముంది? అయితే, మన తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ, టీఆర్ఎస్, మహారాష్ట్రాలోని శివసేన లాంటి పార్టీలు కొంత బెటర్! ఇలాంటి పార్టీల్లో కొడుకులే తండ్రుల ఆస్తికి వారసులైనట్టు పార్టీలకీ వారసులైపోతున్నారు. కాని, నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది విరుద్ధమే...

 

తమిళనాడు సంక్షోభం వెనుక కేవలం జయలలిత మరణం, ఆమెకు తగిన వారసులు లేకపోవటం మాత్రమే లేవు. అంతకన్నా లోతైన వ్యవస్థాగత లోపం దాగుంది. అదేంటంటే, మన దేశంలో కులం, మతం, భాషా, ప్రాంతం లాంటి అంశాలు తీసుకున్నంత సీరియస్ గా అవినీతిని జనం పట్టించుకోవటం లేదు! అవినీతి రహిత పాలన , అభివృద్ధి వంటి నినాదాలు అన్ని వేళలా, అన్ని చోట్లా పని చేయటం లేదు. కొన్ని పార్టీలు , కొందరు నేతలు డెవలప్మెంట్ పాలిటిక్స్ చేస్తున్నప్పటికీ చాలా వరకూ కులం, మతం, సెంటిమెంట్ల మ్యాథమెటిక్సే నడుస్తోంది! అందుకే, ఇండియాని మోడిఫై చేస్తానన్న మోదీ కూడా ఎన్నికల బరిలో జై శ్రీరామ్ అనాల్సి వస్తుంటుంది. లేకపోతే రేసులో కులతత్వ, మతతత్వ పార్టీలతో ఓడిపోవాల్సి వస్తుంది. నిజానికి అవినీతి కేసులో ఆర్నెల్లు జైలుకి వెళ్లొచ్చిన అమ్మ తమిళనాడుకి వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అవ్వటం అంగీకరించాల్సిన విషయం కాదు. అయినా ఆమె పథకాలు, ఛరిష్మా నచ్చి జనం ఓటు వేశారు. పోనీ అలా కాదని జయలలితని అవినీతి విషయంలో శిక్షిద్దామనుకున్నా... 2జీ లాంటి మహాకుంభకోణాల పార్టీ డీఎంకే. వారికి ఓటు వేయటం కంటే అన్నాడీఎంకేనే బెటర్ అని భావించారు తమిళులు! అదే ఇప్పుడు ఇంతటి సంక్షోభానికి దారి తీసింది! జయలలిత వెనుక శశికళ మార్కు మన్నార్ గుడి మాపియా చేతుల్లోకి రాష్ట్రం జారిపోయింది!

 

పార్టీలు, వాటి గుర్తులు, అవ్వి ఇచ్చే దురుద్దేశపూరితమైన వాగ్ధానాలకు మురిసిపోయి జనం ఓట్లు వేసినంత కాలం తమిళనాడు తరహా రాజకీయ జల్లికట్లు తప్పకపోవచ్చు. ఎందుకంటే, ఎమ్మెల్యే పదవికి పోటీపడుతోన్న అభ్యర్థి అర్హతను కనీసం పట్టించుకోకుండా ఎన్నుకుంటారు మన దేశంలో. అందుకే అవకాశం వచ్చినప్పుడు వారు కూడా రిసార్ట్ సర్కసుల్లో తమ తమ పార్టీలకి, శశికళ లాంటి నేతలకి నిస్సిగ్గుగా విధేయత ప్రదర్శించుకుంటారు! తమని ఎన్నుకున్న జనం చిన్నమ్మ వద్దన్నా... శశికళే ముద్దంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తారు! మార్పు రావాల్సింది మనలో...