తాజ్ మహల్ ను కూడా వాడుకుంటున్నారుగా..!

 

ప్రపంచలో ఉన్న వింతల్లో తాజ్ మహల్ కూడా ఒక వింత అని మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అది అందరికీ తెలిసిందే. ముంతాజ్ కు ప్రేమ చిహ్నంగా షాజహాన్ కట్టించిన తాజ్ మహల్ ను చూడటానికి ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు. అలా ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన తాజ్ మహల్ ఇప్పుడు వివాదాల వల్ల పేరు తెచ్చుకుంటుంది. దానికి కారణం.. యూపీ ప్రభుత్వం చేసిన చిన్న తప్పిదం వల్లనే. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ ను... ఉత్తర ప్రదేశ్ పర్యాటక శాఖ విడుదల చేసిన పుస్తకంలో స్థానం కల్పించలేదు. అంతే దీనిపై రేగిన దుమారం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దీనిపై ముందు ఆ పార్టీ అధికార ప్రతినిథి అభిషేక్ మను సింఘ్వి స్పందించి.. పుస్తకంలో తాజ్ మహల్ లేకపోవడం ఓ విధంగా జోక్, మరోవిధంగా విషాదమని పేర్కొన్నారు. డెన్మార్క్ ప్రిన్స్ లేకుండా హ్యామ్లెట్‌ను తీసుకుందామన్నట్లుగా ఉందని పేర్కొన్నారు. ఆ తరువాత ఒకరి తరువాత వరుసగా దానిపై స్పందిస్తూనే ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ అయితే తాజ్ మ‌హ‌ల్ దేశ‌ద్రోహులు నిర్మించిన క‌ట్ట‌డ‌మ‌ని అన్నారు. ఇంకా అదే పార్టీకి చెందిన ఎంపీ వినయ్ క‌తియార్ మ‌హ‌ల్ ఒక‌ప్పుడు హిందూ దేవాల‌యమైన శివాల‌య‌మ‌ని, ఆ ఆల‌యాన్ని తేజోమ‌హాల‌య్ అని పిలిచేవార‌ని.. తేజోమ‌హాల‌యాన్ని మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి షాజ‌హాన్ కూల్చివేసి తాజ్ మ‌హ‌ల్ ను నిర్మించిన విష‌యం వాస్త‌వ‌మ‌ని అని తెలియని స్టోరీ చెప్పారు.

 

ఇక ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే అజంఖాన్  ఈ వివాదంపై కూడా స్పందించి.. రాష్ట్రపతి భవన్ కూడా బానిసత్వానికి ప్రతీక అని.. గత పాలకులు నిర్మించిన అన్ని నిర్మాణాలను తొలగించాల్సిన అవసరం ఉందని..పార్లమెంట్ ఒక్కటే కాదు.. కుతుబ్ మినార్, రాష్ట్రపతి భవన్, ఎర్రకోట, తాజ్‌మహల్ అన్నింటినీ కూల్చేయాల్సిందే అని ఆజంఖాన్ అన్నారు. తాజాగా హర్యానా క్రీడల మంత్రి అనిల్ విజ్ చేసిన ట్వీట్ వివాదానికి దారితీసింది. తాజ్ మహల్ ఓ అందమైన శ్మశానం అని...మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ నిర్మించిన ఆ ప్రేమ చిహ్నం ఓ అందమైన శ్మశాన వాటిక అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

 

మరి ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ ను యూపీ ప్రభుత్వం పర్యాటక పుస్తకం నుండి ఎందుకు తొలిగించిందో అది వారికి మాత్రమే తెలిసిన నిజం. హిందూ సంప్రదాయానికి పెద్ద పీటగా ఉండే బీజేపీ తాజ్ మహల్ ను పుస్తకం నుండి తొలగించి తప్పు చేసిందా అంటే దాని ఫలితం ఎన్నికల్లో కానీ తెలియదు. ఇక బీజేపీ చేసిన ఈ చిన్న తప్పు వల్ల ప్రతిపక్ష పార్టీలు ఊరుకుంటాయా.. ఆరోజు నుండి ఈరోజు వరకూ దానిపై ఎవరో ఒకరు స్పందిస్తూనే ఉన్నారు. మొత్తానికి తాజ్ మహల్ ను ఎవరు కట్టినా.. ఎలా కట్టినా కానీ.. మన నాయకులు మాత్రం ఈ వివాదాన్ని బాగా వాడుకుంటున్నారు.. ఈరకంగా కూడా తాజ్ ను చాలా ఫేమస్ చేసేశారు.