ఏపీ ప్రత్యేకహోదా పోరాటానికి కేసీఆర్ చేతులు కలపాలి

 

రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ఒకరికొకరు అండగా ఉంటూ అన్ని విధాలా సహకరించుకోవాలని అనుకున్నాయి.. ఇప్పుడిదే విషయాన్నీ గుర్తు చేస్తూ ఏపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, ఏపీ ప్రత్యేకహోదా పోరాటానికి కేసీఆర్ కలిసి రావాలని కోరుతున్నారు.. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి అన్ని విధాలా సహకరిస్తా అని కేసీఆర్ మాట ఇచ్చారు.. ఆ మాట ప్రకారం, ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు చేస్తున్న పోరాటంలో కేసీఆర్‌ చేతులు కలపాలని కోరారు.. ఒకవేళ కేసీఆర్‌ కలిసి రాకపోతే కర్ణాటక తరహాలోనే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓటేయాలని ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల ఓటర్లకు పిలుపునివ్వాల్సి వస్తుందని టీజీ హెచ్చరించారు.. నీతి ఆయోగ్‌ సమావేశానికి ముందే కేసీఆర్‌ మోడీని కలవడం, నీతి ఆయోగ్‌లో ఏపీ సమస్యలపై కేసీఆర్‌ మాట్లాడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.. కేసీఆర్ మోడీ వలలో పడకూడదన్న టీజీ, వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాలలోని ప్రజలంతా ఒక తాటి మీద ఉంటేనే కేంద్రం నుండి ఏపీకి న్యాయం జరుగుతుందని అన్నారు.