కేసీఆర్ ని సీఎం చేసింది నేనే.. చంద్రబాబుని మాత్రం చేయను

 

గుంటూరు నగరం గోరంట్లలోని శ్రీపద్మావతి అండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి రిలీజియన్ సొసైటీ దేవస్థానంలో జరుగుతున్న సప్తదశ వార్షిక బ్రహ్మోత్సవాల్లో విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపనంద సరస్వతి పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్ర రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) లో పాలన లోపభూయిష్టంగా ఉందని ఆరోపించారు. ఆలయ భూములు అన్యాక్రాంతం అయ్యాయని.. వాటికి సంబంధించిన ప్రతి ఆధారం తన వద్ద ఉందని.. వాటిని త్వరలోనే మీడియా ముందు ప్రవేశపెడతానని ఆయన అన్నారు. టీడీడీ అధికారులపైనా.. ఏపీ సీఎం చంద్రబాబుపైన కేసు పెడతానని హెచ్చరించారు. వీరిపై కోర్టులో కేసు కూడా వేస్తానని ఆయన అన్నారు. ఏపీలో అవినీతి తారాస్థాయికి చేరిపోయిందని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడానికి తానే కారణమన్నారు. తాను దగ్గరుండి మరీ కేసీఆర్ చేత రాజశ్యామల యాగం చేయించానని.. అందుకే సీఎం అయ్యారని అభిప్రాయపడ్డారు. ఏపీలో ప్రభుత్వం మారడం కోసం త్వరలో తాను మరో రాజశ్యామల యాగం చేస్తానని చెప్పారు.

స్వరూపనంద సరస్వతి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక పీఠాధిపతిగా ఉంటూ రాజకీయాలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. రాజకీయాలు చెయ్యాలంటే పీఠాధిపతి పదవి వదిలేసి వైసీపీలో చేరాలంటూ హితవు పలికారు. సీఎం చంద్రబాబుపై కేసు వేస్తానని స్వరూపానందస్వామి అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక పీఠాధిపతిగా ఉండి ఓ పార్టీకి అనుకూలంగా మాట్లాడటం సరికాదన్నారు. స్వామీజీ రాజకీయాలు మాట్లాడాల్సిన అసవరం ఏంటని నిలదీశారు. ప్రవచనాలు చెప్పాల్సిన స్వామి రాజకీయాలు బోధించడం మానుకోవాలని లేకపోతే వైసీపీలోకి చేరిపోవాలని సాధినేని యామిని అన్నారు.