'ఖర్మ'ని పట్టించుకోవద్దన్న... 'కర్మ'యోగి!


జనవరి 12... భారత యువజన దినోత్సవం! అంటే మన యూత్ డే!ఈ విషయం చాలా మందికి తెలియకపోవటం విషాదమైతే... ఇప్పుడిప్పుడే చాలా మందికి తెలుస్తూ వుండటం ఆనందకరం. ఇంతకీ ఇవాళ్ల ఎందుకని యూత్ డే? యువతకి ఈ రోజుతో ఏం సంబంధం వుంది? 1863లో సరిగ్గా ఇదే రోజున బెంగాల్ లో ఒక ఆధ్యాత్మిక అగ్ని కణం రాజుకుంది! ఆ అగ్ని కణం తొలి వెలుగులు విరజిమ్మిన జయంతి దినోత్సవమే జనవరి పన్నెండు. భారత దేశ యువజన దినోత్సవం!


జనవరి పన్నెండు స్వామి వివేకానంద జయంతి. ఆయన పుట్టుకతో వివేకానందుడు కాదు. నరేంద్రనాథ్ దత్తా. కాని, క్రమంగా ఆత్మాన్వేషణలో రామకృష్ణుల వారి పాదాలకి అంకితమై పరిపూర్ణ పరిణామం చెందాడు. స్వామి వివేకానందుడు అయ్యాడు. నిజానికి శ్రీరామకృష్ణ పరమహంస ఆయనకి పెట్టిన పేరులోనే ఎంతో అర్థం దాగి వుంది. వివేకం అంటే మంచిని, చెడుని, అబద్ధాన్ని, నిజాన్ని, మృత్యువుని, అమృతత్వాన్ని వేరు వేరుగా చూడగలగటం! అంతే కాదు, వివేకం అంటే అశాశ్వతమైనదాన్ని వద్దనుకుని శాశ్వతమైన దాన్ని ధైర్యంగా, స్థిరంగా ఎంచుకోవటం! అలా చేస్తే వచ్చేదే ఆనందం! కాబట్టి వివేకం
వల్ల ఉత్పన్నమయ్యే శాశ్వత ఆనందానికి ప్రతి రూపమే స్వామి వివేకానంద. భారతదేశం యుగయుగాలుగా ప్రపంచానికి అందిస్తోన్న వివేకా, ఆనందాల సందేశానికి సజీవ రూపం ఆయన! 


వివేకానందుడికి యువతకి చాలా పెద్ద సంబంధం వుంది. అందుకే, ఆయన జయంతిని వాజ్ పేయ్ ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది. కేవలం 39సంవత్సరాలు మాత్రమే భౌతికంగా జీవించిన ఆయన ఏనాడూ ముదుసలి భావాల్ని కూడా జోలికి రానీయలేదు. ఆయన చెప్పింది కూడా అదే. సాధారణ సాధువులు, సన్యాసుల మాదిరిగా జపం, తపం, ఉపవాసం వంటి వాటితో సరిపుచ్చలేదు. దేశం బ్రిటీషర్ల కర్కశ హస్తాల్లో నలిగిపోతోంటే వెన్నెముక అరిగిపోయేలా జాతి కోసం పని చేయమన్నాడు. అందుకు యువత మీదే తన నమ్మకం అన్నాడు. ప్రపంచం మారేది యువ శక్తి వల్లేనని స్వామీజీ విశ్వసించారు. బోధించారు. 


వివేకానంద అనగానే ఇప్పుడు నాలుగు కొటేషన్లు వినిపించి కథ ముగించేస్తున్నారు. ఇంతకు ముందైతే అది కూడా వుండేది కాదు. ఎక్కడో చరిత్ర పుస్తకంలో పది లైన్లు మాత్రం ఆయన గురించి రాసి చేతులు దులుపుకునే వారు. అందుకే, స్వామీజీ గొప్పతనం ఆయన 153వ జయంతి నాడు కూడా చాలా మందికి తెలియటం లేదు. అసలాయన ఇప్పుడు బతికి వుంటే నేనాయన పాదాల వద్ద వాలిపోయేవాడ్ని అని సుభాష్ చంద్రబోస్ అన్నారంటే వివేకానందుడిలో ఎంతటి గొప్పతనం దాగి వుండి వుంటుంది? గాంధీ, ఠాగూర్, నెహ్రు, టాటా... ఇలా ఎందరో వివేకానందుడి వల్ల నేరుగా, పరోక్షంగా ప్రేరణ పొందారు. ఇప్పటికీ స్వామీజీ బోధనల్ని చదివి వేలాది మంది కర్తవ్య దీక్షతో రగిలిపోతున్నారు. సినిమా రంగం మొదలు రాజకీయ రంగం వరకూ అన్నిట్లో వివేకానందుడి ప్రేరణ పొందిన వారున్నారు. మన ప్రధాని మోదీ సహా ఈనాటి తరంలో వివేకానందుడి శిష్యులు ఎందరెందరో!


వివేకాందుడు కొత్తగా ఏమీ చెప్పలేదు. ఒకప్పటి శ్రీకష్ణ,శంకరాచార్యుల మాదిరిగానే వేదం, ఉపనిషత్తుల్లో ఏముందో అదే మళ్లీ మళ్లీ ప్రవచించాడు.లే , మేలుకో, గమ్యం చేరేదాకా విశ్రమించకు అన్నదే ఆయన అన్ని బోధనల సారాంశం. దేవుడి పేరు చెప్పొ, మూఢ నమ్మకాల నెపంతోనో దౌర్భాగ్యంలో మునిగిపోవద్దని స్వామీజీ సందేశం. ఖర్మ అని వాపోకుండా కర్మతో తల రాత రాసుకొమ్మని ఆయన చెప్పారు. అదే సమయంలో పాశ్చాత్య ప్రపంచంలో కాలుమోపి భౌతిక సుఖాలకి ఆవల ఏముందో తెలుసుకొమ్మని తట్టి లేపాడు. ఇక్కడ మనకు ధైర్యం నూరిపోస్తే ... ఆక్కడ వారికి వివేకం ప్రబోధించాడు. ఏక కాలంలో భూమ్మీది రెండు ప్రపంచాలకి ఎక్కడ ఏం కావాలో అది అందించాడు. అదే వివేకానందుడి గొప్పతనం... 


తనకి నిజాయితీపరులైన వంద మంది కష్టపడగలిగే యువతి యువకుల్ని ఇవ్వమంటాడు వివేకానందుడు. తాను ప్రపంచాన్నే మార్చేస్తానంటాడు! ఆయన కోరిన ఆ వంద మందిలో మనమూ ఒకరం అవ్వటమే ఇప్పటికిప్పుడు మన ఆత్మోద్ధరణకి, దేశోద్ధరణకి కావాల్సింది! ARISE, AWAKE AND STOP NOT TILL THE GOAL IS REACHED!