పాక్‌తో క్రికెట్ ఇక లేనట్లే-సుష్మాస్వరాజ్

భారత్-పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించాలని గట్టి ప్రయత్నాలు జరుగుతుండగా భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌తో భారత్ ఎప్పటికీ క్రికెట్ మ్యాచ్‌లు ఆడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. గత కొద్దిరోజులుగా దాయాదీ దేశం తరచూ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది. ఈ ఘటనల్లో సైనికులతో పాటు సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు..

 

దీనికి తోడు కొద్దిరోజుల క్రితం కుల్‌భూషణ్ జాదవ్‌ని కలిసేందుకు వెళ్లిన ఆయన తల్లి, భార్యల పట్ల పాక్ అత్యంత అవమానకరంగా ప్రవర్తించింది. దీంతో భారతప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పార్లమెంట్ సాక్షిగా పాక్‌ తీరుపై మండిపడ్డారు. తాజాగా ఇవాళ ఓ సమావేశంలో మాట్లాడిన ఆమె ఆ దేశంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ ఆడేది లేదని స్పష్టం చేశారు. తటస్థ వేదికల్లోనూ ఇరు దేశాల మధ్య మ్యాచ్‌లు జరగవని అన్నారు. ఇందుకు తగ్గట్టుగానే గ్లోబల్ టోర్నమెంట్లలోనూ ఇరుదేశాలను ఒకే గ్రూపులో పెట్టొద్దని బీసీసీఐ గతంలోనే ఐసీసీని కోరింది. మరోవైపు సుష్మ ప్రకటనతో క్రికెట్ ప్రేమికుల్లో కలవరం మొదలైంది.