మరోసారి అమెజాన్ దుస్సాహసం....చెప్పులపై గాంధీ బొమ్మ

 

భారత జాతీయ జెండాతో చేసిన డోర్‌మ్యాట్ల‌ును విక్రయానికి పెట్టినందుకు గాను విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్ ప్రముఖ ఆన్‌లైన్ విక్రయాల సంస్థ అమెజాన్ కు ఇప్పటికే గట్టి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అమెజాన్ బుద్ది రానట్టు ఉంది. ఇప్పుడు మరోసాహసానికి దిగి భారతీయుల ఆగ్రహానికి గురైంది. ఈసారి తమ సైట్లో మహాత్మాగాంధీ బొమ్మతో కూడిన చెప్పులను అమ్మకానికి పెట్టింది. ఇంకేముంది దీనిని గుర్తించిన పలువురు కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇటీవలే అమెజాన్ కెనడా అమ్మకాల్లో జాతీయ జెండాను పోలిన డోర్‌మ్యాట్‌లను విక్రయానికి పెట్టిందని, దీనిపై హెచ్చరించినప్పటికీ తాజాగా గాంధీ బొమ్మతో తయారు చేసిన చెప్పులను అమ్మకాలకు ఉంచిందని.. ఇలాంటి చర్యలను సహించేది లేదని చెప్పారు. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా అమెరికాలోని భారత రాయబారిని ఆదేశించారు. బీజేపీ అధికార ప్రతినిధి నళిన్ కోహ్లి మాట్లాడుతూ, జాతి పిత మహాత్మాగాంధీని ఇలా అవమానించడం ముమ్మాటికి తప్పేనని అన్నారు. దీనిపై సంబంధిత సంస్థకు నోటీసు జారీచేస్తామని, తప్పును సరిదిద్దేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతేకాదు పలు పార్టీలు కూడా అమెజాన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. మరి దీనికి అమెజాన్ అధికారులు ఏం సమాధానం చెబుతారో చూడాలి.