అమేజాన్ పైత్యం... సుష్మా వైద్యం!


 

ప్రపంచంలోని అన్ని దేశాలకూ ఇలాంటి సమస్య వస్తుందో లేదోగాని మన భారతదేశానికి మాత్రం పదే పదే వస్తుంటుంది. ఓ సారి ఓ కంపెనీ లక్ష్మీ దేవీ బొమ్మని అవమానిస్తుంది. మరోసారి మరో విదేశీ కంపెనీ గణపతిని చులకన చేస్తుంది. తాజాగా అయితే అమేజాన్ డాట్ కామ్ వాడు భారత దేశ జెండాపైనే తన పైత్యం చూపాడు. కాళ్లు తుడుచుకునే డోర్ మ్యాట్స్ పై ఇండియా ట్రై కలర్ ఫ్యాగ్ ని ముద్రించాడు. ఇలాంటి అవమానం మనకు జరగటం ఇది మొదటి సారీ కాదు బహుశా చివరి సారి కూడా కాకపోవచ్చు. కాని, అసలు ఎందుకని భారతీయ సంస్కృతిని, మతాన్ని, దేవుళ్లని, ఆఖరుకి జాతీయ పతాకాన్నీ... ఈ పనికిమాలిన కంపెనీలు అవమానిస్తుంటాయి?

అమేజాన్ ఇప్పుడు తన కెనడా అమ్మకాల్లో మన జాతీయ జెండాను డోర్ మ్యాట్స్ పై ముద్రించింది. అందుకు కోపగించిన విదేశాంగ శాఖా మంత్రి ట్విట్టర్ లో ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. ఆ దిక్కుమాలిన డోర్ మ్యాట్స్ వెనక్కి తీసుకోకపోతే ఇక మీద అమేజాన్ కంపెనీ ప్రతినిధులకి ఇండియాలోకి నో ఎంట్రీ అన్నారు. ఇప్పటికే ఇక్కడ వున్న ఆ కంపెనీ విదేశీ ప్రతినిధుల్ని కూడా వీసాలు రద్దు చేసి వెనక్కి వెళ్లగొడతామని బెదిరించారు. ఈ దెబ్బతో అమేజాన్ కు దెయ్యం అమాంతం దిగిపోయింది. త్రివర్ణ పతాకాన్ని అవమానించిన డోర్ మ్యాట్స్ వెనక్కి తీసేసుకుంది. అయితే, పదే పదే మన దేశం మీదా, మన దేవుళ్ల మీద, మన సెంటిమెంట్ల మీదా దాడులు ఎందుకు జరుగుతుంటాయో ఇక్కడే మనం కాస్త మనసు పెట్టి ఆలోచిస్తే సమాధానం దొరికిపోతుంది.

సుష్మా స్వరాజ్ పిచ్చి పిచ్చి చర్చలు, విజ్ఞాప్తులు లాంటివి ఏం లేకుండా అమేజాన్ కు వారెంట్ ఇచ్చారు. ఆ వెంటనే ఆ కంపెనీ తన బలుపు తగ్గించుకుని దారికొచ్చింది. కాని, ఇంత కాలం మన ప్రభుత్వాల్లో ఇదే లోపించింది. ఏ దేశంలో భారత్ కు అవమానం జరిగిన మన ప్రభుత్వాలు నేరుగా రంగంలోకి దిగేవి కావు.  ఏవో అధికార వర్గాలు, లేదంటే స్వచ్ఛంద సంస్థలు పోరాటం చేసేవి. ప్రభుత్వ పెద్దలు నిమ్మకు నీరెత్తినట్టు వుండిపోయే వారు. అందుకే, బాత్రూంలలో , ప్యాంటీలపై మన దేవుళ్ల బొమ్మలు ముద్రించి కూడా గతంలో హాయిగా తప్పించుకున్నారు చాలా మంది సన్నాసులు. ఈ సారి మోదీ ప్రభుత్వం అమేజాన్ కు హై ఓల్టేజ్ షాక్ ఇవ్వటం సమస్యని అమాంతం పరిష్కరించింది. ఇక ముందు ఇలాంటి వెధవ పనులు ఎవరైనా చేయాలంటే కొంత ఆలోచించుకునే స్థితి తెచ్చింది. అయినా కొందరు మేధావులు, బ్రిటీష్ బానిస భావజాలన్ని వదలలేని జర్నలిస్టులు సుష్మా చర్యని తప్పుబడుతున్నారు. ఒక ప్రైవేట్ కంపెనీపై ఏకంగా కేంద్ర మంత్రి దాడి చేయటం అవివేకమని తమ స్వంత సిద్ధాంతాలు వక్కాణిస్తున్నారు. అసలు దేశ జెండాకు అవమానం కంటే ఇంకా పెద్ద నష్టం ఏం వుంటుందో వారికే తెలియాలి! ఆ అంశం కూడా పట్టించుకోకుండా విదేశాంగ శాఖా మంత్రి ఇంకేం చేయాలో?

మన దేశంలో కొందరు ఖచ్చితంగా దేశభక్తి పేరు చెప్పుకుని దాదాగిరి చేస్తుండొచ్చు. కాని, వాళ్లున్నారు కాబట్టి, వారితో జతకట్టేస్తారేమోనని భయపడి... దేశానికి అవమానం జరుగుతుంటే కూడా పిరికిగా నోరు మూసుకుని కూర్చోవటం మాత్రం సరికాదు. సుష్మా స్వరాజ్ లాగే ముందు ముందు కూడా భారత ప్రభుత్వ మంత్రులు, అధికారులు,పౌరులు ఎవరైనా నిర్భయంగా జాతి గౌరవాన్ని కాపాడాలి. అందుకోసం కొంత కటువుగా ప్రవర్తించాల్సి వచ్చిన వెనుకంజ వేయకూడదు...