లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన మోదీ

 

ఉక్కుమనిషి సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకుని అక్టోబరు 31న గుజరాత్‌లో ప్రపంచంలోనే ఎత్తైన పటేల్‌ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవిష్కరించారు.182 మీటర్ల ఎత్తుతో నిర్మించిన ఈ ఐక్యతా విగ్రహంలో 152 మీటర్ల ఎత్తులో పటేల్‌ ఫొటోలతో ఓ గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు. లిఫ్టు ద్వారా ఈ గ్యాలరీలోకి వెళ్లాలి.అయితే తాజాగా బిహార్‌ ఉపముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ ఈ విగ్రహ సందర్శనకు వచ్చారు.

గ్యాలరీకి వెళ్లేందుకు సుశీల్‌ మోదీ, గుజరాత్‌ మంత్రి సౌరభ్‌ పటేల్‌, ఇతర ప్రభుత్వ అధికారులు, భద్రతా సిబ్బంది, మీడియా ప్రతినిధులు లిఫ్ట్‌ ఎక్కారు. అయితే ఓవర్‌లోడ్‌ అవడంతో గ్రౌండ్‌ ఫ్లోర్‌లోనే లిఫ్ట్‌ కదలకుండా ఆగిపోయింది. లిఫ్ట్‌ తలుపు మూసుకుపోవడంతో వారంతా అందులో చిక్కుకుపోయారు.అప్రమత్తమైన సిబ్బంది టెక్నీషియన్ల సాయంతో లిఫ్ట్‌ తలుపులను తెరిచి కొందరు మీడియా సిబ్బందిని దించేశారు. ఆ తర్వాత లిఫ్ట్‌ బయల్దేరింది. అయితే కొంత పైకి వెళ్లాక మరోసారి ఆగిపోయింది. నిమిషం పాటు ఆగిపోయి మళ్లీ బయల్దేరింది. ఇలా సుశీల్‌ మోదీ తదితరులు రెండు సార్లు లిఫ్ట్‌ లో ఇరుక్కుపోవాల్సి వచ్చింది.

విగ్రహాన్ని ఆవిష్కరించిన నాటి నుంచి అందులోని లిఫ్ట్‌ పనిచేయకపోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. విగ్రహాన్ని ఆవిష్కరించిన రోజే లిఫ్ట్‌ పనిచేయలేదు. దీంతో గ్యాలరీకి వెళ్లిన దాదాపు 200 మంది పర్యటకులు మెట్ల దారి ద్వారా కిందకు వచ్చారు.ఎంతో ప్రతిష్టాత్మకంగా వేల కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన పటేల్ విగ్రహంలో సాంకేతికలోపాలు తలెత్తటం పలు చర్చలకు తావిస్తోంది.విగ్రహంలో సాంకేతిక లోపం ఒక్కటేనా లేక నాణ్యతలో కూడా ఎమన్నా లొసుగులు ఉన్నాయా అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేసున్నట్టు సమాచారం.