షిండే తాతయ్యా.. హెల్త్ జాగ్రత్త!

 

 

 

సుశీల్ కుమార్ షిండే తాతయ్యకి ఆంధ్రప్రదేశ్ బాలబాలికల నమస్కారం. మేం ఇక్కడ ఎంతమాత్రం క్షేమంగా, మనశ్శాంతిగా లేము. మీరు మాత్రం ఢిల్లీలో క్షేమంగా, మనశ్శాంతిగా వుండాలని కోరుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేసే పనిలో మీరు చాలా బిజీగా వున్నారని తెలుసు. ఈ లెటర్ చదివేంత తీరిక మీకు వుండదని కూడా తెలుసు. అయినా మనసు ఉండబట్టుకోలేక రాస్తున్నాను.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేయడం అసాధ్యమని తెలిసినా మీరు చాలా కష్టపడుతున్నారు. మీటింగ్స్ మీద మీటింగ్స్ పెడుతున్నారు. మీరు పెట్టే మీటింగుల్లో ఏ విషయమూ తేలక టెన్షన్ పడుతున్నారు. ఆ విషయం మంత్రుల బృందం మీటింగ్స్ ముగిశాక మీరు మీడియాతో మాట్లాడే పద్ధతి చెప్పకనే చెబుతోంది. బుధవారం జరిగిన జీవోఎం సమావేశం చాలా కీలకమైందని వార్తలు రావడంతో యావత్ తెలుగు ప్రజలు, మీడియా ఉత్కంఠని చవిచూశారు. సమావేశంలో ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత వున్న మీడియా మీరు సమావేశ మందిరం నుంచి బయటకి రాగానే లోపలేం జరిగిందని అడిగింది. లోపలేం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత వున్న మీరు మీడియా మీద చిరాకుపడ్డట్టు మాట్లాడారు.



బుధవారం నాటి మీటింగ్ జీఓఎం చివరి మీటింగ్ అని గతంలో మీరే ఒకసారి చెప్పారు. మళ్ళీ మీరే మరికొన్ని మీటింగ్స్ వుంటాయని చెప్పారు. మీరు సృష్టించిన కన్ఫ్యూజన్ తొలగించే ఉద్దేశంతో మీడియా మిమ్మల్ని ఇంకా మీటింగ్స్ వుంటాయా అని అడిగింది. మీరు ఉంటాయనో, ఉండవనో చెబితే సరిపోయేది. అలా కాకుండా చాలా అసహనంగా ‘‘ఇంకా పది మీటింగ్స్ వుంటాయి. ఇప్పుడు సంతోషమేనా?’’ అన్నారు. మీడియా అడిగిన ఏ ప్రశ్నకీ సరైన సమాధానం ఇవ్వకుండా చిరాకుగా మాట్లాడారు. ఇదంతా చూస్తుంటే మాకు ఏమర్థమైందంటే, వయసు పైబడిన మీకు బీపీ బాగా పెరిగిపోయింది. దాన్ని అర్జెంటుగా కంట్రోల్ చేయాల్సిన అవసరం వుంది. ఆంధ్రప్రదేశ్ విభజన లాంటి అసాధ్యమైన పనిని సోనియాగాంధీ మీ నెత్తిన పెట్టింది. పాపం మీకు బీపీ పెరగకుండా ఎలా వుంటుంది? రాష్ట్ర విభజన అవుతుందో, అవదో తర్వాతి సంగతి... ముందు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ముఖ్యంగా బీపీని కంట్రోల్ చేసుకోండి షిండే తాతయ్యా!

ఇట్లు..

-ఆంధ్రప్రదేశ్ బాలబాలికలు