కాంగ్రెస్‌కి సర్వేల గండం!

 

 

 

ఎన్నికల సర్వేల పేరు చెబితే చాలు కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిపడుతోంది. ఎన్నికల సర్వేలనేవే వుండకూడదని తాజాగా ఉద్యమం చేపట్టింది. ఎన్నికల సర్వేలను రద్దు చేయించే వరకూ విశ్రమించకూడదని నిర్ణయించుకుంది. ఈమేరకు ఎన్నికల కమిషన్‌కి ఉత్తరం రాసేసింది. కాంగ్రెస్ సర్వేల మీద ఇంత ఇదిగా కత్తికట్టడానికి కారణం ఇటీవల వచ్చిన కొన్ని సర్వే రిపోర్టులే.

 

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ ఎన్నికల సంగ్రామం త్వరలో జరుగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రచారపర్వం నడుస్తోంది. ఈ మూడు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండవచ్చన్న పాయింట్ మీద కొన్ని సంస్థలు సర్వేలు నిర్వహించాయి. ఆ సర్వేల్లో ఎన్నికలు జరిగే మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ గల్లంతయిపోతుందని తేలింది. బీజేపీ ఈ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించే అవకాశం వుందని ఆ సర్వేలు తేల్చాయి. దాంతో కాంగ్రెస్ పార్టీ మొగుడు కొట్టినందుకు కాదు.. తోడికోడలు నవ్వినందుకన్నట్టుగా తనలో ఏ లోపం ఉందో పరిశీలించుకోకుండా సర్వేల మీద మండిపడుతోంది.



తాజాగా మూడు రాష్ట్రాల విషయంలో జరిగిన సర్వేల వెనుక కుట్ర దాగి వుందని, దేశంలో ప్రస్తుతం సర్వేల రాకెట్ నడుస్తోందని విమర్శలు మొదలుపెట్టింది. తనకెలా తెలుసోగానీ, ఏ పార్టీ డబ్బులిస్తే ఆ పార్టీకి అనుకూలంగా సర్వేలు చేసే సంస్థలు పుట్టుకొచ్చాయని అంటోంది. ఓటర్ల మనసులను ప్రభావితం చేసే ఇలాంటి సర్వేలకు అడ్డుకట్ట వేయాలని నినదించింది. వెంటనే దేశంలో ఎన్నికల సర్వేలను నిషేధించాలని  ఎన్నికల కమిషన్‌కి లేఖ రాసింది. ఎన్నికల కమిషన్ తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తోంది.



అయితే బీజేపీ మాత్రం కాంగ్రెస్ వైఖరిని తీవ్రంగా ఖండించింది. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోబోతోందని సర్వేలు రావడంతో తట్టుకోలేని కాంగ్రెస్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని విమర్శిస్తోంది. ఎన్నికల సర్వేలను నిషేధించాలని డిమాండ్ చేయడం అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమని అంటోంది. గతంలో జరిగిన అనేక సర్వేలలో కాంగ్రెస్ అనుకూల ఫలితాలు వచ్చినప్పుడు ఎగిరి గంతేసిన కాంగ్రెస్ ఇప్పుడు తనకు వ్యతిరేకంగా వచ్చేసరికి మొత్తం సర్వేల వ్యవస్థనే తప్పుపట్టడం, ప్రజల వాక్ స్వాతంత్ర్యాన్ని కాలరాయాలని చూడటం దారుణమని విమర్శిస్తోంది. ఎట్టిపరిస్థితులలోనూ సర్వేలను నిషేధించకుండా చూస్తామని బీజేపీ పట్టుదలగా చెబుతోంది.