శబరిమల తీర్పు.. రివ్యూ పిటిషన్లపై బహిరంగ కోర్టులో విచారణ

 

కేరళలోని శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతిస్తూ సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పు వెలువడిన నాటి నుంచి శబరిమలలో ఆందోళనలు చోటుచేసుకున్నాయి. తీర్పుకు వ్యతిరేకంగా వేలాది మంది నిరసనకారులు ర్యాలీలు నిర్వహించారు. మరోవైపు సుప్రీం తీర్పును సవాల్‌ చేస్తూ ట్రావెన్‌కోర్‌ దేవస్వామ్‌ బోర్డు సహా పలువురు రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశారు. వీటిని అంగీకరించిన న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. ఈ రివ్యూ పిటిషన్లను బహిరంగ కోర్టులో విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ కేసును పునఃసమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టు ఎదుట మొత్తం 49 పిటిషన్లు దాఖలయ్యాయి. వచ్చే ఏడాది జనవరి 22న ఈ పిటిషన్లపై బహిరంగ కోర్టులో విచారణ జరుపుతామని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే పాత తీర్పుపై స్టే ఇవ్వలేమని పేర్కొంది.