సుప్రీం చీఫ్ జస్టిస్ పై లైంగిక ఆరోపణలు.. కోర్టు విచారణ

 

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పై లైంగిక ఆరోపణలు చేస్తూ ఒక మహిళ చేసిన ఫిర్యాదు కలకలం రేపుతోంది. సుప్రీంకోర్టులో జూనియర్ కోర్టు అసిస్టెంట్ గా పని చేస్తున్న ఆమె.. తాజాగా 22 మంది న్యాయమూర్తులకు సమర్పించిన అఫిడవిట్ లో ఈ ఆరోపణలు చేశారు. గత ఏడాది అక్టోబరు 10, 11 తేదీల్లో జస్టిస్ గొగోయ్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని.. తన కుటుంబాన్ని వేధింపులకు గురి చేసినట్లుగా ఆమె ఆరోపించారు. ప్రధాన న్యాయమూర్తి వేధింపులను తిరస్కరించినందుకు తనను.. తన కుటుంబాన్ని తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు జడ్జిలను ఆశ్రయించారు. దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టింది.

కాగా దీనిపై రంజన్ గొగోయ్ స్పందించారు. ఇరవై ఏళ్ల పాటు నిస్వార్థంగా సేవలు అందించిన తనపై ఇలాంటి ఆరోపణలు చేయటాన్ని నమ్మలేకపోతున్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. తనపై వచ్చిన ఆరోపణల్ని ఆయన ఖండించారు. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేసిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్... న్యాయవ్యవస్థలో అలజడి సృష్టించేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని అందులో భాగంగానే తనపై ఈ లైంగిక వేధింపుల ఆరోపణలు అని చెప్పారు. తను ఓ ముఖ్య కేసును వచ్చే వారం విచారణ చేయనున్నానని.. ఇందులో భాగంగానే న్యాయవ్యవస్థను భయపెట్టి మేనేజ్ చేయాలని చూస్తున్నారని జస్టిస్ రంజన్ గొగోయ్ మండిపడ్డారు.

తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయించిన వారి వెనక పెద్దల హస్తం ఉందని ధ్వజమెత్తారు. అంతేకాదు తనమీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళ క్రిమినల్ నేపథ్యం ఉన్న వ్యక్తి అని.. ఆమెపై ఇప్పటికే రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయని గుర్తుచేశారు. 20 ఏళ్ల సర్వీసు తర్వాత తన బ్యాంకు ఖాతాలో రూ.6 లక్షలు, పీఎఫ్‌ ఖాతాలో రూ.40 లక్షలు ఉందని చెప్పిన రంజన్ గొగోయ్ డబ్బు అంశంపై తనను ఎవరూ పట్టుకుని ప్రశ్నించరని.. ఇక వేరే కారణం కోసం వెతికి తనను ఇరికించే ప్రయత్నంచేస్తున్నారని గొగోయ్ ధ్వజమెత్తారు. తనను ఎవరూ భయపెట్టలేరని చెప్పిన జస్టిస్ గొగోయ్ తన డ్యూటీని తాను చేస్తానని చెప్పారు. తనపై వచ్చిన లైంగిక ఆరోపణల కేసు విచారణలో తన జోక్యం ఉండబోదని చెప్పిన గొగోయ్.. సీనియర్ జడ్జి అరుణ్ మిశ్రా బెంచ్ ఎలాంటి ఆర్డర్ ఇచ్చినా అందుకు సమ్మతమే అని చెప్పారు. అయితే ఈ కేసు విచారణ చేయాలని చెప్పడంలో తానే బాధ్యత తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఈ కేసుపై భిన్నస్వరాలు వినిపిస్తున్నందున తానే స్వయంగా విచారణకు ఆదేశించినట్లు జస్టిస్ గొగోయ్ చెప్పారు.