రాఫెల్ డీల్.. మోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు క్లీన్‌చిట్

 

రాఫెల్ డీల్ తో కేంద్ర ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందంటూ గత కొంతకాలంగా కాంగ్రెస్‌ ఆరోపణలు చేస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. మోదీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాఫెల్ డీల్ పై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తుకు ఆదేశించాలంటూ యశ్వంత్‌ సిన్హా, అరుణ్ శౌరీ, న్యాయవాది ఎంఎల్‌ శర్మ తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం నవంబర్‌ 14న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా ఈ పిటిషన్లను కొట్టివేస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది.

రాఫెల్ డీల్ ప్రక్రియలో అనుమానించదగ్గదేమీ లేదని రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. ఏ దేశానికైనా యుద్ధ విమానాలు అవసరం అని, భారత వైమానిక దళంలోకి నాలుగు, ఐదో తరం యుద్ధవిమానాలను చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోర్టు అభిప్రాయపడింది. దేశ భద్రత దృష్ట్యా కొన్ని అంశాల్లో గోప్యత పాటించాల్సి వస్తుందని పేర్కొంది. రాఫెల్ డీల్ నిర్ణయ విధానం, ధరల వ్యవహారం, అంతర్జాతీయ ఒప్పందం వంటి అంశాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణాలు కన్పించట్లేదని తెలిపింది. అంతేగాక .. ఈ డీల్ లో ప్రైవేట్ సంస్థకు లబ్ధి చేకూరుతుందని చెప్పేలా సాక్ష్యాలేమీ లేవని న్యాయస్థానం పేర్కొంది. మొత్తానికి మోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది.