ఎస్సీ, ఎస్టీ చట్టంపై కేంద్రానికి షాకిచ్చిన సుప్రీం..


ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం కోర్టు కేంద్రానికి షాకిచ్చింది. ఎస్సీ, ఎస్టీ చట్టంపై కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయతే దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు..స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఇంకా దీనిపై మాట్లాడుతూ.. తాము చట్టానికి వ్యతిరేకం కాదని.. కానీ అమాయకులకు శిక్షపడొద్దనేదే తమ అభిమతమని తెలిపింది. ఇదే సమయంలో కేంద్రానికి కూడా మొట్టికాయలు వేసింది. ‘ప్రజల హక్కులను ఎలా కాపాడాలో మాకు బాగా తెలుసు. మా ఉత్తర్వులను రాజకీయం చెయొద్దు. అసలు ఆందోళనలు చేస్తున్న వాళ్లు మా తీర్పును క్షుణ్ణంగా చదివారా?. ఆందోళన వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయి. ఎలాంటి విచారణ లేకుండా అరెస్టులు చేయాలని ప్రభుత్వం ఎందుకనుకుంటుంది అని ప్రశ్నించింది. తదుపరి విచారణను పది రోజులు వాయిదా వేసింది.

 

కాగా, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలో ఉన్న కీలకమైన నిబంధనల్ని సవరిస్తూ మార్చి 20వ తేదీన సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగిన సమయంలో ముందుగా అరెస్టులు చేయరాదని, ముందస్తు బెయిల్‌ను మంజూరు చేయాలని తీర్పులో పేర్కొంది. ఆ తీర్పును పున:పరిశీలించాలంటూ కేంద్రం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది.