సన్‌స్క్రీన్‌ వాడుతున్నారా? సమస్యలకు సిద్ధం కండి!

మనుపటి రోజుల్లో అందం గురించి శ్రద్ధ అంతగా ఉండేది కాదు. ఉన్నా దాన్ని కాపాడుకునే మార్గాలు చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడలా కాదు! అందం గురించిన ఆసక్తీ ఎక్కువయ్యింది. దాన్ని సొమ్ము చేసుకునేందుకు లక్షల ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఒకోసారి మన అందాన్ని కాపాడుకునేందుకు తీసుకునే చర్యలు ప్రాణాంతకం కావచ్చునంటున్నారు పరిశోధకులు. అందుకు ఉదాహరణే సన్‌స్క్రీన్‌ లోషన్లు!

 


మొక్కలకీ మనుషులకీ మధ్య ఓ పోలిక ఉంది. మొక్కలు సూర్యకాంతి మీద ఆధారపడి తమ ఆహారాన్ని ఉత్పత్తి చేసుకున్నట్లుగానే, మనుషులు సూర్యుడి నుంచి విటమిన్ డిని పొందుతారు. అలా సహజంగా లభించాల్సిన విటమిన్‌ డికి దూరమైతే చాలా సమస్యలే వస్తాయి. ఊపిరితిత్తుల జబ్బులు, ఎముకలు బలహీనపడిపోవడం, కండరాలు పనిచేయకపోవడం, డయాబెటిస్‌, మెదడు ఎదుగుదలలో లోపాలు... లాంటి ఎన్నో ఇబ్బందులు డి విటమిన్ లోపంతో తలెత్తుతాయని చెబుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే- మన శరీరంలోని ప్రతి కణానికీ విటమిన్ డి చాలా అవసరం.

 


సన్‌స్క్రీన్‌ లోషన్లు వాడటం వల్ల, సూర్యుడి నుంచి వెలువడే ultraviolet rays (అతినీలలోహిత కిరణాలు) నుంచి తప్పించుకునే ఉద్దేశం మంచిదే కావచ్చు. ఎందుకంటే వీటివల్ల శరీరం మీద మచ్చలు పడటం దగ్గర్నుంచీ, స్కిన్ కేన్సర్‌ వరకూ చాలా సమస్యలే వస్తాయి. కానీ బయటకి అడుగుపెట్టే ప్రతిసారీ సన్‌స్క్రీన్‌ లోషన్ రాసుకోవడం వల్ల మన శరీరం డి విటమిన్ను ఏమాత్రం ఉత్పత్తి చేసుకోలేదట. ఒక అంచనా ప్రకారం SPF 15 (sun protection factor) కంటే ఎక్కువ గ్రేడ్‌ ఉండే సన్‌స్క్రీన్‌ లోషన్లు డి విటమిన్‌ను దాదాపు 99 శాతం అడ్డుకుంటాయి. ఇప్పుడు మనకి మార్కెట్‌లో కనిపిస్తున్న సన్‌స్క్రీన్‌లు SPF 15 కంటే ఎక్కువగానే ఉంటున్నాయి.

 


సన్‌స్క్రీన్‌ లోషన్లతో మరో ప్రమాదం కూడా ఉంది. రంగు తక్కువగా ఉన్నవారు, ఎండలో మరింత నల్లబడతామేమో అన్న అనుమానంతో ఈ లోషన్లు తెగ వాడేస్తూ ఉంటారు. సాధారణంగా నల్లటి చర్మం ఉన్నవారిలో విటమిన్ డిని ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం మరింత తక్కువగా ఉంటుంది. వీరు సన్‌స్క్రీన్‌ వాడటంతో అసలుకే ఎసరు వస్తుంది.

 


బయట ఎండ విపరీతంగా ఉన్నప్పుడు సన్‌స్క్రీన్‌ రాసుకుని సిద్ధం కావడం మంచిదే కానీ.... దానిని మీ మేకప్ కిట్‌లో భాగంగా మార్చుకోవద్దని సూచిస్తున్నారు. పౌడర్‌ వాడినంత తరుచుగా సన్‌స్క్రీన్‌ లోషన్ వాడితే డి విటమిన్ లోపం రాక తప్పదని హెచ్చరిస్తున్నారు. అసలే డయాబెటిస్ వంటి సమస్యలని అదుపు చేయడానికి విటమిన్ డి చాలా అవసరం కదా!
ఇంతా చదివిన తరువాత మనకి విటమిన్‌ డి చాలా అవసరమనీ, దాన్ని సన్‌స్క్రీన్‌ లోషన్లతో అడ్డుకోవద్దనీ తేలిపోయింది. కానీ విటమిన్ డి కోసం ప్రత్యేకించి స్విమ్ సూట్లు వేసుకుని బీచ్ ఒడ్డున పడుకోవాల్సిన పనిలేదని చెబుతున్నారు. వారానికి ఒక గంటన్నా ఒంటికి ఎండ తగిలేలా జాగ్రత్తపడితే కావల్సినంత డి విటమిన్‌ ఒంటికి పడుతుందట.

 

- నిర్జర.