ఈగ విలన్ కి వలేస్తున్న కాంగ్రెస్ పార్టీ

 

రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఈగ’ సినిమాలో విలన్ పాత్ర పోషించిన కన్నడ నటుడు సుదీప్ గురించి ఇప్పుడు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈగ సినిమా అమాంతం అతనికి జాతీయ స్థాయిలోమంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఇక కర్ణాటక రాష్ట్రంలో, కన్నడ సినిమా పరిశ్రమలోఅతని పేరు మారు మ్రోగిపోతోంది. మరి అటువంటి వ్యక్తి మీద రాజకీయ పార్టీలు కన్నుపడటం సహజమే గనుక అన్ని రాజకీయ పార్టీలు ఆయనని తమ పార్టీలోకి ఆకర్షించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కానీ, ఆయన కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

 

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య స్వయంగా ఆహ్వానించడంతో బుధవారం ఉదయం సుదీప్ బెంగళూరులో ఆయన అధికారిక నివాసం ‘కృష్ణ’కు వెళ్లి దాదాపు అర్ధ గంట సేపు ఆయనతో సమావేశమయ్యారు. రానున్న సాధారణ ఎన్నికలలో సుదీప్ ను కాంగ్రెస్ అభ్యర్ధిగా పార్లమెంటుకు పోటీ చేయించాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య భావిస్తున్నట్లు సమాచారం. అయితే, వారి సమావేశ వివరాలు ఇంకా తెలియలేదు.

 

రాజకీయాల పట్ల ఆసక్తి చూపిస్తున్న సందీప్ ఇటీవల జరిగిన కర్ణాటక శాసన సభ ఎన్నికలలో జగలూర్ నుండి సుదీప్ పోటీ చేయాలని భావించినప్పటికీ, ఆ సమయానికి ఏ రాజకీయ పార్టీలో జేరాలో నిర్ణయించుకోకపోవడంతో ఎన్నికలలో పోటీ చేయలేదు. కానీ బీదర్ నుండి పోటీ చేసిన అశోక్ ఖేని అనే అభ్యర్ధికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. బహుశః వచ్చే సాధారణ ఎన్నికలలో సుదీప్ కాంగ్రెస్ యంపీగా పోటీ చేయవచ్చును.