వేసవితో మనసు చెడిపోతుంది

 

వేసవికాలంతో రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుసు. డీహైడ్రేషన్ వంటి సందర్భాలలో ఈ సమస్యలు మెదడు మీద కూడా ప్రభావం కలిగిస్తాయన్న విషయమూ తెలుసు. కానీ ఎండాకాలం క్రుంగుబాటు, మతిభ్రమణం వంటి మానసిక సమస్యలు తీవ్రతరం అవుతాయని ఎప్పుడన్నా విన్నారా!

 

వియత్నాంలో మానసిక రుగ్మతలకు చికిత్సను అందించే  Hanoi అనే ఆసుపత్రి ఉంది. ఈ ఆసుపత్రిలో చేరే రోగుల సంఖ్యకీ ఎండలకీ మధ్య ఏమన్నా సంబంధం ఉందేమో అన్న అనుమానం వచ్చింది ఓ పరిశోధకునికి. దాంతో 2008 నుంచి 2012 వరకు ఓ ఐదేళ్ల పాటు అక్కడ చేరిన రోగుల వివరాలను సేకరించాడు. వీటిని విశ్లేషించగా ఆశ్చర్యకరమైన ఫలితాలు తేలాయి.

- వేసవిలోని ఒక మూడు నుంచి ఏడు రోజుల వరకూ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైతే... మానసిక సమస్యలతో ఆసుపత్రిలో చేరే రోగుల సంఖ్య కూడా పెరిగిందట.

- చలికాలంతో పోలిస్తే వేసవికాలంలో ఆసుపత్రిలో చేరే రోగుల సంఖ్య 24 శాతం ఎక్కువగా ఉంది.

- సాధారణంకంటే ఒక్క శాతం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నా కూడా ఆసుపత్రిలో రెండు శాతం ఎక్కువ రోగులు చేరుతున్నారు.

- మూడురోజులకు మించి వడగాలులు వీచినప్పటికంటే వారంపాటు విడవకుండా వడగాలి వీచినప్పుడు రెట్టింపు రోగులు మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు.

- వృద్ధులు, నగరాలలో ఉండేవారు వేసవితో త్వరగా అనారోగ్యం పాలవుతున్నట్లు తేలింది.

 

వాతావరణంలోని అధిక ఉష్ణోగ్రతల మన మెదడు మీద ఇంతగా ప్రభావం చూపుతాయని ఎవరూ ఊహించి ఉండరు. కానీ తాజా పరిశోధనతో వేసవిలో కాస్త జాగ్రత్తగా ఉండాలన్న సూచన వినిపిస్తోంది. అంతేకాదు! గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయనీ... వీటి ప్రభావం మన మెదడు మీద ఉండే అవకాశం ఉందని కూడా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

 

ఈ పరిశోధన వియత్నాంలో జరిగినప్పటికీ మన దేశంలో ఇంతకంటే దారుణమైన ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వియత్నాంలో వేసవికాలం పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకి మించవు. మరి మన దగ్గరేమో 40కి తగ్గవు. ఇక వడగాడ్పుల గురించి చెప్పేదేముంది!

 

- నిర్జర.