రాజుగారి మౌనానికి అర్ధమేంటి? ఉంటారా? పార్టీ మారతారా?

సుజయకృష్ట రంగారావు... విజయనగరం జిల్లా బొబ్బిలి రాజవంశీయులు... రాజరికం అంతరించిన తర్వాత కూడా ఎమ్మెల్యేగానూ, మంత్రిగానూ తన నియోజకవర్గపు కోటను పాలించారు. అయితే, ఇప్పుడు, యుద్ధంలో ఓడిన రాజులా డీలాపడిపోయారు. దాంతో, రాజ్యంలో కార్యకర్తలు విలవిల్లాడిపోతున్నారు. రాజుగారి మౌనాన్ని తలచుకుని కుంగిపోతున్నారు. మళ్లీ కత్తి పట్టుకుని రాజ్యాన్ని నిలబెట్టాలని కోరుతున్నారు.

రాజరికపు వారసులుగా రాజకీయాల్లోకి వచ్చిన సుజయకృష్ట రంగారావు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో వైసీపీ నుంచి పోటీచేసి గెలుపొందాక, టీడీపీలో చేరి మంత్రి పదవిని చేపట్టారు. అయితే, మంత్రి అయిన తర్వాత, సుజయకృష్ట రంగారావు నియోజకవర్గ అభివద్దికి పాటుపడలేదని, అందుకే 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూశారని అంటారు. అయితే, మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు సుజయకృష్ట రంగారావు దూరంగా ఉంటున్నారు. అయితే, స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నవేళ, నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు దూరంగా ఉండటంతో తెలుగుదేశం కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. 

కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి నియోజకవర్గ కార్యకర్తలకు ధైర్యాన్ని నూరిపోసి, పార్టీని బలోపేతం చేయాల్సిన రాజుగారు ఇలా, మౌనం దాల్చడమేంటని తెలుగు తమ్ముళ్లు టెన్షన్ పడుతున్నారు. సుజయకృష్ట రంగారావుతోపాటు ఆయన సోదరుడు శ్వేతా చలపతి రంగారావుకు నియోజకవర్గ ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. వాళ్లిద్దరూ ప్రజల్లోకి వెళ్తే మళ్లీ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని అంటున్నారు. సుజయకృష్ట రంగారావు సోదరుడు శ్వేతా చలపతి రంగారావు టీడీపీని వీడి బీజేపీలో చేరతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయనగరం టీడీపీలో స్తబ్దత నెలకొనడంతో ఇప్పటికే పలువురు పార్టీని వీడి వెళ్లిపోతున్నారని అంటున్నారు. 

మొత్తానికి, విజయనగరంలో తెలుగుదేశాన్ని ముందుకు నడిపించే నాయకుడు లేడంటూ కొట్టుమిట్టాడుతున్న టీడీపీ శ్రేణులను, బొబ్బిలి రాజుగారి మౌనం, మరింత కుంగదీసేలా ఉందని అంటున్నారు. మరి, రాజుగారి మనసులో ఏముందో... పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉండటానికి కారణాలేంటో తెలియాలంటే ఆయన మౌనం వీడాల్సిందే.