సుజనా, గరికపాటిలకు కేంద్రమంత్రి పదవులు?

 

టీడీపికి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ఇద్దరికి కేంద్రమంత్రి పదవులు దక్కనున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఒకరికి స్వతంత్ర హోదాతో కూడిన మంత్రి పదవి, మరొకిరకి సహాయ మంత్రి పదవి ఇవ్వొచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

2014 ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీయేలో టీడీపీ అధికారాన్ని పంచుకుంది. దీంతో అప్పట్లో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు, సహాయమంత్రిగా సుజనా చౌదిరికి అవకాశం కల్పించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని చేజెక్కించుకున్న బీజేపీ తెలంగాణలో గెలిచిన కిషన్ రెడ్డికి సహాయమంత్రి పదవి కట్టబెట్టింది. ప్రస్తుతం పార్టీ మారి బీజేపీ తీర్థం పుచ్చుకున్న నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ఇద్దరికి మంత్రిపదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పార్టీని వీడకముందు ఈ నలుగురు సభ్యులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షాను కలిసి ఆయన ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచినట్లు సమాచారం. అందులో ముఖ్యమైనది మంత్రిపదవుల అంశమని తెలుస్తోంది. మంత్రిపదవులు విషయంలో బీజేపీ అధినాయకత్వం వీరికి ఇప్పటికే కచ్చితమైన భరోసాకూడా ఇచ్చినట్లు సమాచారం. ఏపీకి చెందిన సుజనా చౌదరి, తెలంగాణకు చెందిన గరికపాటి మోహన్ రావుకు మంత్రి పదవులు ఖాయమని తెలుస్తోంది.