ఆయన అనుభవాలు - మన జీవితాన్నే మర్చివేస్తాయి!

 

సుబ్రతో బాగ్చీ – చాలామంది ఈ పేరుని వినే ఉంటారు. ఐటీ నిపుణుడిగా, రచయితగా సుబ్రతో పేరు భారతీయులకి సుపరిచితమే! ఈ స్థాయికి చేరుకోవడానికి సుబ్రతో చాలానే కష్టపడి ఉండవచ్చు. కానీ తన తల్లిదండ్రులు నేర్పిన విలువలే తన విజయానికి బాటలు వేశాయంటారు సుబ్రతో. 2006లో సుబ్రతో, కాన్పూర్ IIM విద్యార్థులతో తన జీవితపాఠాలను పంచుకున్నారు. భారతీయులు ఇచ్చిన అత్యద్భుత ఉపన్యాసాలలో ఇదీ ఒకటని అంటారు. వాటిలోని ముఖ్య అంశాలు....

 

- మా నాన్నగారు ఓ చిన్న ప్రభుత్వోద్యోగి. ఆయన టూర్లకి వెళ్లేందుకు ప్రభుత్వం ఒక జీప్ ఇచ్చింది. కానీ ఆ జీప్లో ఎప్పుడూ ఆయన మమ్మల్ని కూర్చోనిచ్చేవారు కాదు. అంతేకాదు! టూర్లకి వెళ్లేందుకు తప్పితే ఆయన కూడా దానిని వాడేవారు కాదు. ఆఫీసుకి కూడా రోజూ నడిచేవెళ్లేవారు. ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగులలో కనపడని నిబద్ధత ఇది!

 

- మా జీపు డ్రైవరుని ఆయన ఎప్పుడూ పేరుతో పిలవనిచ్చేవారు కాదు. ‘దాదా’ (పెద్దాయనా) అనే పిలవమనేవారు. నీకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నవారికంటే, నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారికే ఎక్కువ గౌరవం ఇవ్వాలన్న మర్యాద నాకు అలా అలవడింది.

 

- మా నాన్నగారికి రేడియో కానీ, సొంత ఇల్లు కానీ ఉండేవి కావు. అదేమని అడిగితే ‘నా పిల్లలే నా ఆస్తిపాస్తులు’ అనేవారు. వ్యక్తిగత విజయానికి ఆస్తులు కొలబద్ద కాకూడదన్న పాఠం అలా ఆయన నుంచి నేర్చుకున్నాను.

 

- ఉద్యోగరీత్యా మా నాన్నగారికి తరచూ బదిలీ అవుతుండేది. కొత్త ప్రదేశంలో మాకు ఇచ్చే ప్రభుత్వ క్వార్టర్స్ ఎలాంటి ప్రహరీ లేకుండా బోసిగా ఉండేవి. మా అమ్మ కష్టపడి ఇంటి ముందు ఒక కంచె వేసి పూల మొక్కలు నాటేది. వాటిని చెదలు తినేస్తే మళ్లీ నాటేది. తీరా ఆ మొక్కలు పెరగి పెద్దవయ్యేలోగా మేము వేరేచోటకి బదిలీ అయిపోయేవారం. ‘మీరు చేసే పనితో మీ తర్వాత వారే లాభపడతారు. మరి ఇంత శ్రమెందుకు తీసుకుంటారు?’ అని ఇరుగుపొరుగూ అడిగేవారు. దానికి అమ్మ ‘నేను అడుగుపెట్టిన ప్రతి చోటనీ మరింత అందంగా మార్చాలి కదా!’ అంటూ జవాబిచ్చేది. ‘విజయం అంటే నీకోసం సృష్టించుకునేది కాదు, నువ్వు వదిలివెళ్లేదే నిజమైన విజయం’ అని నాకు ఆరోజున అర్థమైంది.

 

- అమ్మకి శుక్లాలు రావడంతో ఆమెకోసం వార్తాపత్రికలు చదివి వినిపించేవాడిని. ఆ వార్తల గురించి మేం చర్చించుకునేవారం కూడా. ప్రపంచం చాలా విశాలమైందన్న అనుభవం ఆ వార్తల వల్లే కలిగింది. నా సృజనకు పదునుపెట్టే అవకాశం దక్కింది. సృజన (creativity) ఉంటే భవిష్యత్తుని ముందుగా ఊహించగలం. ఆ ఊహని నిజం చేసుకోగలం. మనం నిజం చేసుకున్న ఊహలో మరికొందరు జీవించే అవకాశాన్నీ కల్పించగలం!

 

- మా అమ్మకి శుక్లాల ఆపరేషన్ చేసిన వారం రోజులకే పరిస్థితి విషమించి చూపు పోయింది. కానీ ఆ తర్వాత 32 ఏళ్ల పాటు అలా చూపులేకుండానే గడిపగలిగింది. ఆమె తీరు చూసి ఆశ్చర్యం వేసిన నేను ఓసారి ‘నీకు చీకటి మాత్రమే కనిపిస్తుందా!’ అని అడిగాను. దానికి ఆమె ‘లేదు! నాకు కళ్లు లేకపోయినా వెలుతురు మాత్రమే కనిపిస్తుంది,’ అని జవాబిచ్చింది. అలా ఆమెకు 80 ఏళ్లు వచ్చేవరకూ రోజూ ఉదయాన్నే యోగా చేయడం, తన గదిని శుభ్రం చేసుకోవడం, తన బట్టలు ఉతుక్కోవడం చేసేది. స్వతంత్రంగా బతకడమే విజయం అని ఆమె నుంచి నేర్చుకున్నాను. ప్రపంచాన్ని చూడటం కాదు, వెలుగుని చూడటమే విజయం అని తెలుసుకున్నాను.

 

- మా నాన్నగారిని ఓసారి తీవ్రమైన గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి నర్సులు రోగులతో చాలా దుర్మార్గంగా ప్రవర్తించేవారు. ఓసారి మా నాన్నగారి రక్తపు బాటిల్ నిండుకుందని, నేను నర్సుతో చెప్పినా కూడా ఆమె వినిపించుకోలేదు. కాసేపటికి కళ్లు తెరిచిన మా నాన్నగారు ఆ నర్సుని చూసి ‘నువ్వింకా ఇంటికి వెళ్లకుండా పనిచేస్తున్నావా!’ అని పరామర్శించడం చూసి ఆశ్చర్యపోయాను. సాటి వ్యక్తి పట్ల మనం చూపగలిగే కరుణకు హద్దులు ఉండవని ఆ సంఘటనతో తెలుసుకున్నాను.

 

- 82 ఏళ్ల వయసులో మా అమ్మగారికి పక్షవాతం వచ్చిందని తెలిసి ఆమెను చూడటానికి విదేశాల నుంచి వచ్చాను. పక్షవాతంతో కదల్లేని ఆమె దగ్గర రెండువారాలు గడిపాను. చివరికి నేను వెళ్లాల్సిన సమయం దగ్గరపడటంతో ఆమెని ముద్దు పెట్టుకొని వీడ్కోలు చెప్పాను. దానికామె ‘నన్ను కాదు! వెళ్లి ప్రపంచాన్నే ముద్దు పెట్టకో!’ అని చెప్పింది. జీవితంలో అన్నిరకాల కష్టాలూ చూసిన మనిషి ‘వెళ్లి ప్రపంచాన్ని ముద్దు పెట్టుకో!’ అని ఎంత ఉదారంగా చెప్పిందో! జీవితమంటే ఈ ప్రపంచంతో అనుబంధం ఏర్పరుచుకోవడం అనీ, జీవితం నుంచి తీసుకున్నదానికంటే ఎక్కువ ఇవ్వగలగడం అనీ, సాధారణ జీవితంతో అసాధారణమైన విజయాలను సొంతం చేసుకోవడం అనీ నాకు తెలిసొచ్చింది.

 

(సుబ్రతో బాగ్చీ Go Kiss the World ప్రసంగం ఆధారంగా. ఇదే పేరుతో ఆయన తర్వాత ఓ పుస్తకాన్ని రాశారు)

- నిర్జర.