"పద్మావతి"లో కూడా వేలు పెట్టిన స్వామి...

 

అన్ని విషయాల్లో వేలు పెట్టే బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి ఇప్పుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న "పద్మావతి" సినిమాలో కూడా వేలుపెట్టాడు. ఇప్పటికే చరిత్రను వక్రీకరించారని బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు చూపించకుండా ఆ సినిమాను విడుదల చేయకూడదని... ఒకవేళ విడుదలైన సినిమా హాళ్లను తగులబెడుతామని కొందరు హెచ్చరికలు కూడా జారీచేశారు. ఇప్పుడు స్వామి స్పందిస్తూ.. దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. హిందూ మహిళలను అవమానించే లక్ష్యంతో దుబాయ్ నుంచి నిధులు వస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఈ సినిమా కు అసలు సిసలు నిర్మాతలు దుబాయ్ షేకులని... హిందూ మహిళల క్యారెక్టర్ ను దెబ్బ తీసేందుకు అరబ్బులు 'అంతర్జాతీయ కుట్ర` పన్ని పద్మావతిని నిర్మించారని ఆరోపించారు. కాగా ఇప్పటికే "పద్మావతి" సినిమాపై పలు వివాదాలు తలెత్తాయి.  భన్సాలీ చరిత్రను వక్రీకరించారని రాజ్‌పుత్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరిలో పద్మావతి షూటింగ్‌ జరుగుతున్న సమయంలోనే రాజ్‌పుత్‌ కర్ని సేన భగ్గుమంది. పద్మావతి సెట్‌లో బీభత్సం సృష్టించింది. దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీపై దాడికి పాల్పడింది. ఇక ఇప్పుడు ఈ సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ వివాదాలు మరింత పెరుగుతున్నాయి. మరి ఈ సినిమాపై ఇంకెంత దుమారం రేగుతుందో చూడాలి.