పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్ధకం... స్కూళ్లను కూడా వదలని వైసీపీ రాజకీయం!!

 

స్కూళ్లు..పిల్లలు అంటే ఎవరైనా.. ఎక్కడైనా.. రాజకీయం చెయ్యడానికి అంతగా ఇష్టపడరు. కానీ ప్రకాశం జిల్లా నేతలు మాత్రం ససేమిరా అంటున్నారు. చిన్నారుల జీవితాలు ఏమైపోతే మాకేంటి.. మా పంతాలే మాకు ముఖ్యమని భీష్మించుకుని కూర్చున్నారు. వెరసి స్కూల్లో ఏకంగా ఓ పథకమే ఆగిపోయిన కూడా చీమకుట్టినట్లు కూడా బాధపడటం లేదు.

కొండపి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రానికి కొంత దూరంలో ఉన్న అనకర్లపూడి గ్రామంలో ఈ పాఠశాల ఉంది. గత 13 సంవత్సరాలుగా అక్కడి దళిత కాలనీ లోని పాఠశాలలో తుమ్మ లక్ష్మి అనే మహిళ మధ్యాహ్న భోజనం సమకూరుస్తుంది. వైసిపి సర్కారు రావడంతో ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. అధికారంలోకి రాగానే లక్ష్మిని తొలగించాలని అధికారులకు హుకుం జారీ చేశారు వైసిపి నేతలు. నేతలు చెబితే తప్పుతుందా అని ఉన్నతాధికారులకు కొండపి ఎంఈవో ఓ లేఖ రాశారు. లక్ష్మి సరిగా పనిచేయటం లేదంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా లక్ష్మిని తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.అధికార పార్టీ నేతలు సూచించిన అదే గ్రామంలోని వేరొక మహిళకు ఆ బాధ్యతలు అప్పగించేశారు.

ఈ మార్పును పాఠశాల విద్యార్థులు ఒప్పుకోలేదు. తమకు వండి పెట్టే ఆయా లక్ష్మీ ని తీసేశారని తల్లిదండ్రులకు చెప్పారు. వేరే ఎవరినో పెట్టారని.. భోజనం సరిగ్గా లేదంటూ ఫిర్యాదు చేశారు. దీంతో వివాదం రాజుకుంది. లక్ష్మిని తొలగించడం పై తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పేరెంట్స్ కమిటీకి తెలియకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. వైసిపి నేతలు చెప్పిన వ్యక్తినే అధికారులు కొనసాగించటంతో తల్లిదండ్రులు ఆగ్రహించారు. పిల్లల్ని స్కూలుకు పంపకుండా ఆపేశారు. దీంతో ఇది జిల్లా స్థాయిలో అధికారులకు తెలిసిపోయింది. టీచర్లు ఫుల్.. స్టూడెంట్స్ నిల్.. అన్నట్లుగా మారింది పరిస్థితి.స్కూల్ విషయం లో రాజకీయం చివరికి పాఠశాల మూసేసే వరకు దారి తీసింది. అటు వైసీపీ నేతలు ఇటు తల్లిదండ్రులు ససేమిరా అనడంతో విద్యార్ధుల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారింది. ఈ విషయం లో కొండపి ఎమ్మెల్యే జోక్యం చేసుకుంటారా..లేక జిల్లాకి చెందిన విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ స్పందిస్తారా.. అనే విషయం వేచి చూడాలి.