ఒత్తిడిలో పోషకాహారమూ దండగే!

 

రోజూ మీరు తినే ప్రతి ముద్ద విషయంలోనూ చాలా అప్రమత్తంగా ఉంటున్నారా? మీరు తినే ఆహారంలో తగినన్ని పోషకపదార్థాలూ, వీలైనంత తక్కువ కొవ్వు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? మంచిదే! కానీ మనసులో ప్రశాంతత కరువైతే మాత్రం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఉపయోగం లేదంటున్నారు పరిశోధకులు...

 

మంచి ఆహారం- చెడు ఆహారం:

అమెరికాలోని ఒహియోకి చెందిన కొందరు వైద్య నిపుణులు ఒక పరిశోధనను చేపట్టారు. ఇందులో భాగంగా వారు సగటున 53 ఏళ్ల వయసు ఉన్న కొందరు మహిళలను ఎన్నుకొన్నారు. వీరిలో కొందరు క్యాన్సర్‌నుంచి కోలుకున్నవారు ఉండగా, మరికొందరు ఆరోగ్యవంతమైన స్త్రీలూ ఉన్నారు. వీరికి రెండు రకాల ఆహారాన్ని అందించి... వాటిలో ఏదో ఒక ఆహారాన్ని తినమని చెప్పారు. ఇందులో ఒక రకం ఆహారంలో విపరీతమైన కొవ్వు పదార్థాలు ఉండగా, మరో రకం ఆహారంలో కొవ్వు శాతం వీలైనంత తక్కువగా ఉండేలా చూశారు.

 

ఒత్తిడి గురించిన వివరాలు:

పరిశోధనలో పాల్గొన్నవారు పోషకాహారాన్ని తీసుకోవడం వల్ల వారి రక్తంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? అన్న విషయాన్ని తేల్చేముందు, పరిశోధకులు వారిని కొన్ని ప్రశ్నలు అడిగారు. నిన్న మీ రోజు ఎలా గడిచింది? మీలో ఒత్తిడిని విపరీతంగా పెంచే సంఘటనలు ఏవన్నా చోటు చేసుకున్నాయా? వంటి వివరాలను సేకరించారు. వీటి ఆధారంగా వారిలో ఎవరెవరు ఒత్తిడిలో ఉండి ఉంటారో గమనించారు.

 

ఆశ్చర్యం!

పరిశోధకులు రెండు రకాల ఆహార పదార్థాలనూ తీసుకున్న అభ్యర్థుల నుంచీ రక్తాన్ని సేకరించారు. ఆ రక్తాన్ని పరీక్షించి... వారి రక్తనాళాలలో వాపునీ (inflammation), గడ్డలనీ (plaque) కలిగించే పరిస్థితులలో ఏమన్నా మార్పులు వచ్చాయేమోనని గమనించారు. ఆశ్చర్యం ఏమిటంటే, ఒత్తిడిలో ఉన్నవారు మంచి ఆహారం తిన్నా కూడా వారి రక్తంలో ఏమంత ఆరోగ్యకరమైన పరిస్థితులు కనిపించలేదు. మనసు ప్రశాంతంగా ఉండి, మంచి ఆహారాన్ని తీసుకున్నవారిలోనే కాస్త మెరుగైన ఆరోగ్యాన్ని సూచించే లక్షణాలు తేలాయి.

 

 

ఇదీ పాఠం!

పోషకాహారం మీద విపరీతమైన శ్రద్ధ చూపించేవారికి ఈ పరిశోధన కాస్త నిస్తేజాన్ని కలిగించడం సహజమే! ఎలాంటి ఆహారం తింటే మాత్రం ఏంటి ఉపయోగం అన్న అభిప్రాయం వారిలో కలగవచ్చు. కానీ పరిశోధకుల ఉద్దేశం పోషకాహార విలువని తక్కువ చేయడం కాదు. ‘మీరు ఆహారాన్నే కాదు, మనసుని కూడా పట్టించుకోండి’ అన్న సూచనను అందించడమే వీరి లక్ష్యం. శారీరిక ఆరోగ్యం మీద చూపించే శ్రద్ధని, మానసిక ప్రశాంతతకి కూడా కేటాయించండి అని హెచ్చరించడమే వీరి అభిప్రాయం.

 

- నిర్జర.