ఒత్తిడిని గుర్తించండి.. ఒదిలించండి

 

 

ఒత్తిడి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అని నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అబ్బే లేదే నేనేం ఒత్తిడిలో లేను అని చాలామంది కొట్టి పారేస్తారు. కానీ ఒత్తిడిని గుర్తించటంలో మనం పొరపాటు పడినా, దాని ప్రభావాన్ని చూపించటంలో అది ఏమాత్రం జాలి పడదు. మన మనసు పైనే కాదు, శరీరం మీద కూడా దాని ప్రభావం చాలా వుంటుంది అంటున్నారు నిపుణులు. నమ్మకం కలగటం లేదా.. అయతే వివరంగా వివరాలు చెబుతాను ..


1. ఎప్పుడయినా మెడ దగ్గర విపరీతమైన నొప్పిగా అనిపించిందా? అలా అయతే మీ కంటే ముందే మీ కండరాలు మీలోని ఒత్తిడిని గుర్తించాయి అని తెలుసుకుని రిలాక్స్ అవ్వండి వెంటనే. ఒత్తిడి మనసు మీదే కాదు కండరాల మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది, దాంతో అవి పట్టేసినట్టు అవుతాయి.. బ్రీతింగ్ కు సంబంధించిన వ్యాయామాలు ఆ సమయం లో ఒత్తిడిని, కండరాల ఇబ్బందిని తగ్గిస్తాయి.


2. కళ్ళు అదరటం, మంటగా అనిపించటం వంటివి కళ్ళు ఒత్తిడికి గురయ్యాయని సూచిస్తాయి. ఆ సమయంలో కళ్ళు మూసుకొని ఓ పది నిముషాలు రిలాక్స్ అవ్వటం మంచిది. కాదని మొండిగా పనిచేస్తే ఆ ఒత్తిడి మనసుని చేరుతుంది.


3. గోళ్ళు కోరుకుతున్నారా? అయతే ఏదో విషయంలో మీరు ఒత్తిడికి గురయ్యారని అర్ధం. ఈ విషయం అని ఆలోచనలో పడకండి.. తెలీకుండా గోళ్ళు కొరుకుతుంటే... చక్కగా ఓ మంచి పాట వినండి, వేడి వేడి, టీ తాగండి... మనసు తేలిక పడుతుంది.


4. ఒకోసారి ఎందుకో తెలియదు.. అస్సలు నిద్ర పట్టడం లేదు అంటారు చాలామంది. ఆ ఎందుకో వెనక ఒత్తిడి దాగుందని తెలుసుకోరు. నిజానికి ఏదో ఆందోళన మనసులో నిండి వుంటే అది హార్మోన్ల మీద ప్రభావాన్ని చూపించి నిద్రని దూరం చేస్తుంది. బాగా ఒత్తిడిలో వుంటే కంటి నిండా నిద్ర కరువే. అందుకు పరిష్కారం రోజు రాత్రి పడుకునే ముందు ఓ పది నిముషాలు ధ్యానం వంటిది చేయటం. మంచి మ్యూజిక్ వింటూ నిద్రలోకి జారుకోవటం. నిద్ర వచ్చేదాకా ఇంటర్నెట్ ముందో, టీవీ ముందో గడిపితే అది ఒత్తిడిని మంరింత పెంచుతుంది కాని తగ్గించదు. నచ్చిన పుస్తకం చదవటం కూడా మనసుని రిలాక్స్ చేస్తుంది.


5. అన్నీ మరచిపోతున్నా ఈ మధ్య.... అనిపిస్తే... కచ్చితంగా ఒత్తిడిలో ఉన్నట్టే. ఎందుకంటే ఒత్తిడి ఎక్కువగా వుంటే ఆ ప్రభావం మెదడు మీద పడుతుంది. దాంతో చాలా విషయాలు మర్చి పోతుంటాం. ఆ మార్చి పోవటం మళ్ళీ ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ సర్కిల్ ని బ్రేక్ చేయాలంటే ఒత్తిడికి చెక్ చెప్పటం ఒక్కటే పరిష్కారం. రోజూ కొంత సేపు వ్యాయామం చేయటం, మెడిటేషన్ వంటివి ఒత్తిడిని తగ్గించేందుకు ఉపయోగపడతాయి.


ఒత్తిడి ఎప్పుడు, ఎందుకు వస్తుందో తెలియదు. ఒకోసారి చిన్న విషయాలు కూడా ఒత్తిడిని కలిగిస్తాయి. ఎందుకు అని తీవ్రంగా ఆలోచించే కంటే... ఒత్తిడి దరిచేరకుండా మనం ఏం చేయగలం అన్నది తెలుసుకుని, అది పాటించటం మంచిది. ఇందుకు నిపుణులు చెప్పేది ఒక్కటే... మీ మనసుకు నచ్చే పనుల కోసం రోజూ కొంత సమయం కేటాయించండి. రోజు వారి ఒత్తిడులకి ఇదే మంచి పరిష్కారం అని. సో మీకు ఇష్టం అయినది ఏంటో అది చేయండి.. ఒత్తిడికి దూరంగా వుండండి. మనలని అన్నివిధాలా ఇబ్బంది పెట్టె ఒత్తిడిని సకాలంలో గుర్తించి... అందులోనుంచి బయట పడటం అన్నివిధాలా ఏంతో ముఖ్యం.