మేడారం జాతర... ఎప్పుడు? ఎందుకు? ఎలా మొదలైందో తెలుసా?

సమ్మక్క సారాలమ్మ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆదివాసీలకు కాకతీయ రాజులకు మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలోనే ఈ గాథలన్నీ ప్రాచుర్యంలోకి వచ్చాయి. కొన్ని కథల్లో సమ్మక్క మరణించినట్లు ఉంటే... మరికొన్ని కథల్లో నెత్తురోడుతూ చిలుకల గుట్టవైపు వెళ్లిపోయిందని చెబుతున్నాయి. ఇంకొన్ని గాథల్లో సమ్మక్క సహగమనం చేసినట్లు ఉంటుంది. కొన్ని కథల్లో ఆదివాసీలకు... కాకతీయ ప్రభువులకు మధ్య ఘర్షణ జరిగి... కప్పం కట్టకపోవడం కారణంగా చెప్పగా... మరికొన్ని కథల్లో సహజ వనరుల పంపకాల్లో వివాదం వచ్చినట్లు ఉంది. అయితే, ఆదివాసీల నుంచి కాకతీయ రాజులు కప్పం వసూలు చేసిన దాఖలాల్లేవని చరిత్రకారులు చెబుతున్నప్పటికీ... ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న కథలు మాత్రం కప్పమే యుద్ధానికి కారణమని చెబుతున్నాయి. అయితే, అందరి నోళ్లలో ప్రసిద్ధి చెందిన కథ ఇలా ఉంది.

ఏడో శతాబ్దంలో తమ నివాస స్థలమైన మేడారం నుంచి కోయ దొరలు వేట కోసం అడవికి వెళ్లగా, ఓ చోట పెద్ద పులులు కాపలా మధ్య దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఓ పసిపాప కనిపించిందని, ఆ పాపను కోయదొరలు తమ గూడేనికి తీసుకెళ్లి పెంచి పెద్దచేశారని, అయితే... ఆ పసిపాప వచ్చినప్పట్నుంచి అన్నీ శుభాలే జరగడంతో కొండ దేవతే తమకు పాప రూపంలో సాక్షాత్కరించిందని నమ్మి ఆ చిన్నారికి సమ్మక్కగా పేరు పెట్టారని చెబుతారు. అలా, పెరిగి పెద్దయిన సమ్మక్కను కోయ చక్రవర్తి అయిన మేడరాజు... కరీంనగర్ ప్రాంతాన్ని ఏలుతున్న తన మేనల్లుడైన పగిడిద్ద రాజుకిచ్చి పెళ్లి జరిపించాడని చెబుతారు. పగిడిద్ద రాజు, సమ్మక్కకు సారాలమ్మ, నాగులమ్మతోపాటు జంపన్న జన్మించారు. అయితే, మేడారం ప్రాంతాన్ని పాలించే కోయరోజులు... ఓరుగల్లు రాజులకు సామంతులుగా ఉండేవారు. కరువు కాటకాలతో ఒక సంవత్సరం కోయరాజుల... కాకతీయ ప్రభువులకు కప్పం చెల్లించలేకపోయారు. దాంతో, కాకరాజు రాజు ప్రతాపరుద్రుడు తన సైన్యాన్ని గిరిజనులపైకి యుద్ధానికి పంపాడు. అయితే, కాకతీయ సేనల ముందు గిరిజనులు నిలువలేకపోయారు.

ఈ యుద్ధంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజుతోపాటు వారి కుమార్తెలు సారాలమ్మ, నాగులమ్మ, అల్లుడు గోవిందరాజు వీరణమరణం పొందుతారు. ఈ పరాజయాన్ని తట్టుకోలేక జంపన్న... మేడారం సమీపంలోని వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతారు. అయితే, సంపెంగ వాగు సమీపంలో జంపన్నను కాకతీయ సేనలు హతమార్చాయని మరో కథ ప్రచారంలో ఉంది. జంపన్న వీరమరణం పొందిన వాగు కావడంతో దాన్ని అప్పట్నుంచీ జంపన్న వాగుగా పిలుస్తారు. అయితే, భర్త పిల్లల మరణవార్త తెలుసుకున్న సమ్మక్క మహోద్రురాలిగా మారి కాకతీయ సేనలపై విరుచుకుపడిందని, కానీ... ఓ సైనికుడు దొంగచాటుగా బల్లెంతో పొడవడంతో తీవ్రంగా గాయపడిన సమ్మక్క నెత్తురోడుతూనే ఈశాన్య వైపునున్న చిలుకలగుట్టపైకి వెళ్లి అదృశ్యమైందని చెబుతారు. సమ్మక్కను కొందరు కోయలు అనుసరించినప్పటికీ జాడ తెలియలేదని, అయితే చిలుకలగుట్టపైనున్న నాగవృక్షం కింద ఒక కుంకుమ భరిణె కనిపించడంతో, సమ్మక్కే అలా మారిందనే నమ్మకంతో అప్పట్నుంచి మాఘశుద్ధ పౌర్ణమి రోజు ముత్తయిదువల పండగ జరుపుకోవడం మొదలుపెట్టారని, ఇదే కాలక్రమేణా జాతరగా రూపొంతరం చెంది, సమ్మక్క సారాలమ్మ మేడారం మహా జాతరగా మారింది.

అయితే, కోయవీరులు మరణించారంటే ఆదివాసీలు అంగీకరించరు. వాళ్లింకా బతికే ఉన్నారని... సమ్మక్క భరిణె రూపంలో రెండేళ్లకోసారి సాక్షాత్కరిస్తుందనేది వాళ్ల విశ్వాసం. అందుకే, ప్రతి రెండు సంవత్సరాలకోసారి ఈ మేడారం నిర్వహిస్తున్నామని చెబుతారు. అలా, ఆదివాసీల్లో వీరవనితగా పేరుగాంచిన సమ్మక్క... కుంకుమభరిణె రూపంలో వెలిసి... భక్తులకు కొంగుబంగారంగా విరాజిల్లుతోందని పురాణగాథలు చెబుతున్నాయి.