నాన్న తోడుంటే -ఏదైనా సాధించవచ్చు

 

పిల్లల్ని పెంచడంలో తల్లి పాత్రని ఎవ్వరూ కాదనలేరు. కానీ బిడ్డల మీద తండ్రి ప్రభావం కూడా అసాధారణమే అంటున్నారు పరిశోధకులు. ఈ మధ్యకాలంలో వెలుగుచూసిన కొన్ని పరిశోధనల తండ్రి కేవలం తెరచాటు మనిషి మాత్రమే కాదనీ... పిల్లలు ఎదిగేందుకు అతని తోడ్పాటు చాలా అవసరమనీ తేల్చి చెబుతున్నాయి. వాటిలో కొన్ని...

 

తండ్రిలానే ఉంటాము

 

పిల్లవాడు పుట్టగానే అతనిది తల్లి పోలికా తండ్రి పోలికా అని బేరీజు వేస్తుంటారు. ఎదిగేకొద్దీ తండ్రి బుద్ధులు వచ్చాయా, తల్లి అందం వచ్చిందా అని తరచి చూసుకుంటారు. నిజానికి పిల్లవాడికి తల్లీ, తండ్రీ ఇద్దరి నుంచీ సమానమైన లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. పైగా మన కణాలకు జీవాన్నిచ్చే ‘మైటోకాండ్రియా’ కేవలం తల్లి నుంచే పిల్లలకు వస్తుంది. కానీ ఈ మధ్య జరిగిన ఓ పరిశోధనలో తండ్రి జన్యువులే పిల్లవాడి మీద ఎక్కువ ప్రభావం చూపుతాయని తేలింది. తండ్రి నుంచి పిల్లవాడికి సంక్రమించిన genetic mutations మరింత బలంగా ఉంటాయట. కాబట్టి వంశపారంపర్యమైన వ్యాధులు వచ్చినా, మంచి రోగనిరోధకశక్తి ఉన్నా... తండ్రిదే కీలకపాత్ర కావచ్చు.

 

తండ్రి ప్రేమకి మంచి మార్కులు

 

టీనేజి పిల్లలకి చదువు మీద ధ్యాస అంతగా ఉండదు. అసలే పరిపరివిధాలా పోతున్న మనసుకి ఆర్థిక సమస్యలు కూడా తోడైతే ఇక చెప్పేదేమంది. చదువు కాస్తా చెట్టెక్కి తీరుతుంది. కానీ తండ్రి కనుక వీరికి అండగా నిలిస్తే... ఎలాంటి సమస్యనైనా దాటుకుని చదువులో ముందుండి తీరతారట. అయితే ఈ ప్రభావం ఆడపిల్లల మీద ఒకలా మగపిల్లల మీద ఒకలా ఉండటం గమనార్హం! తండ్రి నుంచి అందే ప్రేమతో ఆడపిల్లలు లెక్కలలో బాగా రాణిస్తే, ఆయన నుంచి వచ్చే ఆత్మవిశ్వాసంతో మగపిల్లలు ఇంగ్లిష్లో మంచి మార్కులు సాధించడాన్ని గమనించారు.

 

తండ్రి పక్కనుంటే డిప్రెషన్ దూరం

 

చక్కగా చూసుకునే నాన్న పక్కన ఉంటే, పిల్లవాడికి ఎలాంటి ఢోకా ఉండదంటున్నారు స్వీడన్కు చెందిన పరిశోధకులు. దాదాపు 20 ఏళ్లపాటు శోధించి తేల్చిన విషయం ఇది. ప్రేమతో మెలిగే తండ్రి ఉన్న మగపిల్లలు లేనిపోని గొడవల జోలికీ, చెడు వ్యసనాల జోలికీ పోకుండా ఉంటారట. ఇక ఆడపిల్లలేమో మానసిక సమస్యలకి దూరంగా నిబ్బంగా జీవించగలుగుతారట. వంద కాదు వెయ్యి కాదు... దాదాపు ఇరవైవేల మంది పిల్లలను పరిశీలించిన తర్వాత తేల్చిన విషయమిది!

 

తండ్రి ద్వేషం

 

పిల్లల్ని తండ్రి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చాలామంది అనుకుంటారు. పిల్లల్ని దగ్గరకు తీస్తే ఎక్కడ పాడైపోతారో అని చాలామంది తండ్రులు, పిల్లలని దూరం పెడుతుంటారు. కారణం ఏదైనా కానీయండి... తల్లికంటే కూడా తండ్రి నుంచి వచ్చే వ్యతిరేకతే పిల్లల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందట. ఆ ప్రభావం వారి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుందని హెచ్చరిస్తున్నారు. దాదాపు పదివేల మంది మీద జరిగిన 36 పరిశోధనల సారాంశమిది! మరెందుకాలస్యం. భేషజాలను పక్కన పెడదాం! తండ్రి కూడా తల్లితో సమానంగా పిల్లలకి ప్రేమ పంచగలడని నిరూపిద్దాం. హ్యాపీ ఫాదర్స్ డే!

- నిర్జర.