కడుపు మంట

కడుపుమంట అనేది వచ్చేది... ఎదుటివాడు తింటుంటే చూసి మనం తినట్లేదని కాదు.. మనం తిన్న అన్నము జీర్ణము కాకపోయినా....త్రేన్పులు వచ్చినా...మంట, దద్దుర్లు, తలనొప్పి వాంతి విరేచనాలు వచ్చేయంటే వస్తుంది కడుపుమంట.... దీనినే అమ్లపిత్త వ్యాధి అంటారు. ఇలా కడుపుమంట వ్యాధి వస్తే తీసుకోవలసిన..ముందుజాగ్రత్తలు:   యవలు,గోధుమలు, పెసలు,పాతవైన ఎర్రవడ్లు కాచి చల్లార్చిన నీరు, చక్కెర,తేనె, పేలపిండి,దోసకాయలు, కాకరకాయలు, అరటిపువ్వు, చక్రవర్తి కూర, పేము ఇగుళ్లు, బాగాపండిన గుమ్మడిపండు, పొట్లకాయలు, దానిమ్మ పండు కఫపిత్త హరములగు అన్నపానములు అన్నీ కడుపుమంట రోగులకు హితకరమైనవి. వాంతిని నిరోధించాలి. నువ్వులు, మినుములు, ఉలవలు నువ్వులతో చేసిన పిండివంటలు, గొర్రెపాలు, పుల్లగంజి, లవణామ్ల రసములు గల పదార్ధములు గురుత్వము చేయు ఆహార పదార్ధములు, పెరుగు, మద్యము వంటివి కడుపుమంట రోగులు తప్పని సరిగా విసర్జించాలి. 


మందుజాగ్రత్తలు:

అతిమధురం, ఎండుద్రాక్ష, గింజతీసిన కరక్కాయ  సమాన భాగాలుగా చేసి చక్కెర కలిపి నూరి ముద్దచేసి లోనికి సేవిస్తే కడుపుమంట తగ్గుతుంది. పిప్పళ్ళను చూర్ణముచేసి 1 నుండి 2 గ్రాములు తేనెలో సేవిస్తే ఆమ్లపిత్త లక్షణాలు శమిస్తాయి. నేలవేము, వేపపట్టల కషాయం తేనెలో సేవిస్తే వాంతి,మంట అను లక్షణాలు శమిస్తాయి. సూతరేఖ రసము, సుదర్శన చూర్ణము, అవిపత్తికర చూర్ణము, పంచతిక్తకషాయము, కూష్మాండలేహ్యము అను యోగాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. పిల్లి పీచర రసాన్ని తేనె లేదా చక్కెర కలిపి సేవిస్తే ఆమ్ల పిత్త వ్యాధి శమిస్తుంది. ఇవండీ కడుపుమంటకు తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు, మందు జాగ్రత్తలు.