జగన్ బందులకి మోదీ ‘చింతకాయలు’రాల్చరు!

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఎందుకు రావటం లేదు? మోదీ ఇవ్వటం లేదు! ఇదే సమాధానం అనుకుంటే అంతకన్నా పెద్ద తప్పుడు ఆలోచన వుండదు. అసలు ఏ కేంద్ర ప్రభుత్వమైనా ఓ రాష్ట్రంలో తమ పార్టీ ప్రభుత్వం లేకపోతే సవితి తల్లి ప్రేమే చూపిస్తుంది. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరమేం లేదు. ఇప్పుడు ప్రత్యేక హోదాకి మేం రెడీ అంటూ కబుర్లు చెబుతున్న కాంగ్రెస్ కూడా రేపు దిల్లీలో అధికారంలోకి వస్తే ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చేస్తుందా? బీజేపీలాగే కబుర్లు చెప్పే ఛాన్స్ లు ఎక్కువ! ఎందుకంటే, ఏపీలోనూ వారి ప్రభుత్వం వుండాలి. ఆ సూచనలు కనిపించటం లేదు. ఇక్కడ టీడీపీనో లేదో వైసీపీనో అధికారంలో వుంటాయి. ప్రాంతీయ పార్టీలు పీఠంపై వుండీ జాతీయ పార్టీలది కేంద్రంలో అధికారమైతే ఇక చెప్పేదేముంది? ఇదీ అసలు సమస్య. అయితే…

 

 

రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీకి జనం జైకొట్టినంత మాత్రాన దిల్లీలోని జాతీయ పార్టీలు ఇష్టానుసారం వివక్ష చూపించుకుంటూ పోతే మనం చూస్తూ ఊరుకోవాల్సిందేనా? అక్కర్లేదు! 2009 – 2014 నడుమ తెలంగాణ కావాలని పది జిల్లాల ప్రజలు రోడ్డెక్కారు. పార్టీలూ ఏకతాటిపైకి వచ్చాయి. ఏ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలన్నా ఒక రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఒక్కటవ్వాలి. అదే విజయానికి మూలం. తమిళనాడులో జల్లికట్టు విషయంలోనూ అదే నిరూపితమైంది. జనం, పార్టీలు అంతా కలిస్తే దిల్లీ కూడా ఒప్పుకోక తప్పదు. సరిగ్గా అదే జరగటం లేదు ప్రత్యేక హోదా విషయంలో!

 

 

ప్రత్యేక హోదా వద్దనే పార్టీ ఏపీలో ఏదీ లేదు. అయినా, ఎవరి రాజకీయం వారిది. జగన్ పిలుపునిచ్చిన తాజా బందే ఇందుకు కారణం. ఆ మద్య తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కూడా అనేక బందులు జరిగేవి. అయితే, చాలా వరకూ అవి సక్సెస్ కావటానికి కారణం జేఏపీ రూపంలో అన్ని పార్టీల్ని నిరసనాల్లో భాగమే చేసే వ్యవస్థ వుండేది. ఇవాళ్టి బంద్ లో అలాంటిదేం లేదు. జగన్ ఒంటెద్దుపోకడ తప్ప ప్రత్యేక హోదాపై నిజాయితీ ఎక్కడా కనిపించటం లేదు! తనకు తానే నిర్ణయం తీసుకుని మంగళవారం రాష్ట్రం బంద్ అనేశారు ప్రతిపక్ష నేత. దానికి ఎవరు మద్దతిస్తారు? ఒక్కమాటలో చెప్పాలంటే ఎవ్వరూ ఇవ్వటం లేదు. ప్రతిపక్ష నేత బందులకి అధికారపక్షం ఎలాగూ అండగా నిలువదు కదా! కనీసం ఇతర ప్రతిపక్షాలైనా వైసీపీ బంద్ కు మద్దతిస్తున్నాయా? ఎక్కడా లేదనే చెప్పాలి!

 

 

జగన్ పిలుపునిచ్చిన బంద్ కు టీడీపీ సహజంగానే సై అనలేదు. విచిత్రంగా ప్రత్యేక హోదా కావాలి అని ఎప్పట్నుంచో అంటోన్న జనసేనాని కూడా తన పని తాను చేసుకుపోతున్నాడు ఇవాళ్ల. బంద్ లో ఆయన వంతు పాత్ర ఏం లేదు. ఇది ఖచ్చితంగా జగన్ వైఫల్యమే. బంద్ విజయవంతంగా నిర్వహించాలనుకున్నప్పుడు కాస్త చొరవ చేసి పవన్ తో అయినా చర్చలు జరపాల్సింది. చంద్రబాబు దగ్గరికి వెళ్లి బంద్ కు సహకరించమని అడగలేరు కదా! వున్న మిగతా ప్రతిపక్షాల్నికూడా కలుపుకుపోకపోతే ఎలా? జనసేనతో సహా పోరాటాలకి , బందులకి నిత్యం సై అనే కమ్యూనిస్టు పార్టీల్ని కూడా జగన్ తన వెంట తెచ్చుకోలేకపోయారు. చివరకు, వైసీపీ బంద్ ప్రత్యేక హోదా కోసం కేంద్రం పై ఒత్తిడి తెచ్చే కార్యక్రమంగా కన్నా తమ పార్టీ బల ప్రదర్శనగా మారిపోయింది. వైసీపీ ఏపీ వీధుల్లో బంద్ నిర్వహిస్తుంటే టీడీపీ పార్లమెంట్లో హోదా కోసం చర్చకు పట్టుబడుతోంది. అక్కడ వైసీపీ టీడీపీకి సహకరించటం లేదు. ఇక్కడ టీడీపీ వైసీపీ వెంట వుండటం లేదు. మిగతా పార్టీల దారి దేనిది దానిదే! ఇలా అనైక్యంగా వుండటమే మోదీకి అత్యంత అనుకూలంగా మారుతోంది. హోదా కంటే ఏపీ రాజకీయ పార్టీలు తమ పొలిటికల్ ఎజెండానే ఎక్కువగా కొనసాగిస్తున్నాయి. దిల్లీ పెద్దలకు కావాల్సింది కూడా అదే!