మహబూబ్‌నగర్‌‌ టీఆర్‌ఎస్‌లో రోడ్డుకెక్కిన విభేదాలు

మహబూబ్‌నగర్‌ జిల్లా గులాబీ దళంలో విభేదాలు బయటపడ్డాయి. ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ మధ‌్య కొద్దిరోజులుగా జరుగుతోన్న కోల్డ్‌ వార్‌ ఓపెన్‌ అయ్యింది. తనకు మంత్రి పదవి రాకుండా జితేందర్‌రెడ్డి అడ్డుపడ్డాడని రగిలిపోతున్న శ్రీనివాస్‌గౌడ్‌... మనసులో మాటను మీడియా ముందే బయటపెట్టేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎంపీ జితేందర్‌రెడ్డి ముందే తన అసంతృప్తిని వెళ్లగగ్గారు శ్రీనివాస్‌గౌడ్‌.

 

1969 తెలంగాణ ఉద్యమంలో తన తండ్రి తూటాలకు ఎదురొడ్డి నిలిచారని, తెలంగాణ ఉద్యమం కోసం ముందుండి పోరాడిన తమకి న్యాయం జరగలేదనే భావనను శ్రీనివాస్‌గౌడ్‌ టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బయటపెట్టారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌ మనోగతం తెలియడంతో వెంటనే ఎంపీ జితేందర్‌ గౌడ్‌ మీడియా సాక్షిగా స్పందించారు. శ్రీనివాస్‌గౌడ్‌కి మంత్రి పదవి రాకుండా సీఎం కేసీఆర్‌తో ఏ ఒక్క మాటా అనలేదని, అలా అని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటానని ఎంపీ జితేందర్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. 

 

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య మనస్పర్థలు కాస్త మీడియా సాక్షిగా బయటపడటం సంచలనంగా మారింది. మీడియా ముందే ఎంపీ, ఎమ్మెల్యే  సవాళ్లు విసుకోవడంపై గులాబీ అధినేత ఎలా స్పందిస్తారోననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చివరికి తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రకటించినా, భవిష్యత్‌లో మళ్లీ రోడ్డుకెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.