శ్రీకాకుళం జిల్లా టిడిపిలో ఏం జరుగుతోంది..?

 

కలిసి ఉంటే కలదు సుఖం అన్న సత్యాన్ని ఆలస్యంగానైనా శ్రీకాకుళం జిల్లాలో తెలుగు దేశం నేతలు తెలుసుకున్నారు. టిడిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి బలమైన క్యాడర్ కలిగిన జిల్లాల్లో శ్రీకాకుళం ఒకటిగా చెప్పవచ్చు. హస్తం పార్టీ హవా జోరుగా కొనసాగిన సమయంలోనూ తెలుగుదేశం పార్టీకి జిల్లా వాసులు వెన్నుదన్నుగా నిలిచారు. అయితే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం జిల్లాలో ఫ్యాన్ గాలి బలంగా వీచింది.  జిల్లాలోని మొత్తం పది శాసన సభ స్థానాలుంటే కేవలం రెండు చోట్ల మాత్రమే టిడిపి గెలిచింది. పార్టీ ఓటమికి గల కారణాలు ఏవైనప్పటికీ జిల్లా టిడిపి నేతలు మాత్రం దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. అధికారంలో ఉన్నప్పుడు కాస్త ప్రజలకు దూరంగా ఉండేవారన్న విమర్శలనెదుర్కున్న పార్టీ నేతలు ఇప్పుడు పంథా మార్చారు.

ప్రతిపక్ష పాత్రలో తమదైన శైలిలో నేతలు చేస్తున్న ప్రయత్నాలూ, ఓటమి నైరాశ్యంలో ఉన్న కార్యకర్తల్లో కొత్త ఉత్తేజాన్ని నింపుతున్నాయట. అధికారులను దూషించారన్న ఆరోపణల నేపథ్యంలో ఇటీవల మాజీ ప్రభుత్వ విప్ కూన రవి కుమార్ పై కేసు నమోదైంది. అరెస్టు తప్పదన్న భావించిన కూన రవికుమార్ నెల రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. హై కోర్టులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్న ఆయన అనంతరం అజ్ఞాతం వీడారు. అయితే నెల రోజుల పాటు రవికుమార్ ఆచూకి కోసం కార్యకర్తలు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. స్వతహాగా గట్టి వాక్చాతుర్యం కలిగి ప్రజల్లో మంచి పట్టున్న నాయకుడిగా రవికి పేరుంది. అలాంటి నాయకుడు పైన కేసులు పెడితే ఇక దిగువ స్థాయి కేడర్ పరిస్థితేంటి అని అందరూ అనుకున్నారట.

ఇక ఇదే సమయంలో జిల్లా టిడిపి ముఖ్య నేతలంతా కూన రవి కుమార్ కు అండగా నిలిచారట. ఆమదాలవలస నియోజక వర్గ కార్యకర్తలతో పాటు రవి కుమార్ కుటుంబ సభ్యులకు మేమున్నాం అని ధైర్యం చెబుతూ వారు భరోసా ఇచ్చారని సమాచారం. ఎన్నికల ముందు వరకు శ్రీకాకుళం జిల్లాలో టిడిపి లో గ్రూపుల గోల ఎక్కువగా ఉండేది. అయితే కూన రవికుమార్ వ్యవహారంలో మాత్రం నేతలంతా ఐక్యంగా ముందుకు సాగడంతో కేడర్ కు కొత్త సంకేతాలు వెళ్ళాయట. మా నాయకులు గతంలో మాదిరిగా కాదని ఇప్పుడు మేమంతా ఒక్కటేనని మాలో ఎవరికైనా కష్టమొస్తే ఐక్యంగా కదులుతామని టిడిపి శ్రేణులు గట్టిగా చెబుతున్నాయట. పార్టీ మీకు అండగా ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదంటూ రవి అనుచరులకు జిల్లా ముఖ్య నేతలు ఇచ్చిన భరోసా ఇప్పుడు పార్టీలో సరికొత్త పరిణామాలకు నాంది అయిందనే భావన వినిపిస్తోంది.

అధికార పీఠం నుంచి ప్రతిపక్షంలోకి వచ్చేసరికి జిల్లా టిడిపి నేతల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుందనే టాక్ జిల్లాలో ఎక్కువగా వినిపిస్తోంది. ప్రజా సమస్యలపై పోరాటం చేయడం, గ్రామాల్లో కార్యకర్తలను అధికార పార్టీ నేతలు వేధింపులకు గురి చేస్తే వారికి అండగా నేతలు నిలబడడం వంటి అంశాలు పార్టీ భవిష్యత్ కి మంచి చేస్తున్నాయన్న భావన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. అయితే ఈ ఐక్యత ఎన్నికల వరకు ఉంటుందా లేక కూన రవి కుమార్ ఇష్యూ తోనే ముగుస్తుందా అనేది మాత్రం అంతుచిక్కడం లేదట. మొత్తమ్మీద ఎడమొహం పెడమొహం అన్నట్టుండే సిక్కోలు టిడిపి నేతలకు ఇపుడు తత్వం బోధపడినట్లుగా తెలుస్తోంది. ఇన్నాళ్ళకు వారికి జ్ఞానోదయం అయింది అన్న సెటైర్ లు కూడా వినిపిస్తున్నాయి.