శ్రీధర్‌బాబు ఏం చేస్తారో!?

 

 

 

శాసనసభను ప్రొరోగ్ చేస్తూ వచ్చిన ప్రతిపాదనకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ సంతకం చేశారు. ఆ ఫైలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు దగ్గరకి చేరింది. శ్రీధర్‌బాబు ఆ ఫైల్‌ని ఓకే చేసి ముఖ్యమంత్రికి పంపిస్తే ఆయన దాన్ని గవర్నర్‌కి పంపిస్తారు. అప్పుడు శాసనసభ ప్రొరోగ్ అవుతుంది. శాసనసభ ప్రొరోగ్ అయితే తెలంగాణ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వంలో టెన్షన్ పెరిగే అవకాశం వుంది. అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన శ్రీధర్‌బాబు ఇప్పుడు తనదగ్గర వున్న ప్రొరోగ్ ఫైల్‌ని ముఖ్యమంత్రి దగ్గరకు పంపుతారా లేదా అన్న ఆసక్తి రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడింది.

 

విభజనవాదులు శ్రీధర్‌బాబు సదరు ఫైల్‌ని ముఖ్యమంత్రికి పంపరని చెబుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతోపాటు రేపు తెలంగాణ ఏర్పడితే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా వున్న వ్యక్తి కావడం వల్ల శ్రీధర్‌బాబు అసెంబ్లీ ప్రొరోగ్ కాకుండా చూసే అవకాశం వుందని అంటున్నారు. అయితే సమైక్యవాదులు మరోరకంగా చెబుతున్నారు. స్పీకర్ నుంచి వచ్చిన ఫైల్‌ని ముఖ్యమంత్రికి పంపడం మినహా శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం లేదని అంటున్నారు. అందువల్ల తనకు ఇష్టం వున్నా లేకపోయినా శ్రీధర్‌బాబు ప్రొరోగ్ ఫైల్‌ను ముఖ్యమంత్రికి పంపి తీరాల్సిందేనని అంటున్నారు.



అదేవిధంగా నలుగురితోపాటు నారాయణ అన్నట్టు తెలంగాణ ఉద్యమానికి మద్దతిస్తున్నారే తప్ప శ్రీధర్‌బాబుకు వ్యక్తిగతంగా రాష్ట్రం విడిపోవడం ఇష్టం లేదని చెబుతున్నారు. శ్రీధర్‌బాబు తండ్రి, మాజీ స్పీకర్, మృదుస్వభావి అయిన దుద్దిళ్ళ శ్రీపాదరావును మావోయిస్టులు గతంలో అన్యాయంగా హతమార్చారు. తెలంగాణ ఉద్యమాన్ని మావోయిస్టులు సమర్థిస్తూ వుండటం, తెలంగాణ ఏర్పడితో తెలంగాణ మావోయిస్టుల అధికారిక నివాసంగా మారిపోయే సూచనలు కనిపిస్తూ వుండటంతో శ్రీధర్‌బాబుకు తెలంగాణ ఏర్పడటం ఇష్టం లేదన్నట్టు తెలుస్తోంది. అందువల్ల శ్రీధర్‌బాబు ప్రొరోగ్ ఫైల్ విషయంలో సంప్రదాయబద్ధంగా వ్యవహరించి ముఖ్యమంత్రికి పంపే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.