శ్రీరామనవమి నాడు పానకం ఎందుకు!

 

హైందవులు జరుపుకొనే ప్రతి పండుగకీ ఒక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎలాగూ ఉంటుంది. దాంతో పాటుగా ఆ సమయాలలో ఉండే వాతావరణం, లభించే వనరులు, ప్రబలే అనారోగ్యాలను కూడా దృష్టిలో ఉంచుకుని వివిధ సంప్రదాయాలను రూపొందించినట్లు కనిస్తుంది. వినాయకచవితి నాడు పత్రిపూజ, దీపావళి నాడు బాణాసంచా, ఉగాది నాడు వేపపచ్చడి... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పండుగకీ కాలానుగుణమైన ఓ సంప్రదాయం జతగా సాగుతోంది. శ్రీరామనవమినాటి పానంకం కూడా అంతే!

 

శ్రీరామనవమి మండువేసవిలో వస్తుంది. ఈ సమయానికి ఎండలే కాదు, గాడ్పులు కూడా మొదలవుతాయి. వేసవిలో బెల్లపు పానకాన్ని తీసుకోవడం వల్ల చాలా మేలే జరుగుతుంది. వేసవిలో ఎక్కువగా చెమట పట్టడం వల్ల... మన ఒంట్లో ఉండే ఖనిజాలైన సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కేల్షియంలు ఆ చెమట ద్వారా బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. పానకంలో ఈ నాలుగు ఖనిజాలూ ఉంటాయి. శరీరం నుంచి వెళ్లిపోయిన ఖనిజాలను అలా పానకం భర్తీ చేస్తుందన్నమాట! ఇక బెల్లంలో ఉండే ఇనుము వేసవి తాపాన్ని ఎదుర్కొనే శక్తినిస్తుంది. అంతేకాదు, వేసవిలో అటూఇటూ ఊగిసలాడే రక్తపోటుని కూడా బెల్లంలో ఉండే ఖనిజాలు అదుపులో ఉంచుతాయి.

 

ఆయుర్వేదం ప్రకారం చూసినా పానకం వల్ల లాభాలెన్నో ఉన్నాయి. వేసవిలో తాపానికి పిత్తదోషాలు ప్రబలుతాయని ఆయుర్వేదం చెబుతోంది. దీనివల్ల అజీర్ణం, గుండెల్లో మంట, జుట్టు రాలడం, దద్దుర్లు, నిద్రలేమి లాంటి లక్షణాలు కనిపిస్తాయట. బెల్లానికి ఈ దోషాలను నివారించే గుణం ఉందంటారు ఆయుర్వేద వైద్యులు. ఇక బెల్లానికి ఉన్న మరో లక్షణం చలవ చేయడం. పైగా వేసవిలో వీలైనంత ఎక్కువగా నీరు తాగాలని పెద్దలు చెబుతుంటారు. అలాంటి నీటిలో బెల్లాన్ని కలుపుకుని పానకంగా తాగడం ఎవరికి మాత్రం ఇష్టముండదు! తెలుగునాట పెళ్లిళ్లలో విడిదికి చేరుకున్న వరుని కుటుంబానికి పానకపు బిందెలను అందించే సంప్రదాయం ఉంది. పెళ్లిళ్లు ఎక్కువగా వేసవిలో జరుగుతాయి కాబట్టి... ఒక పక్క పెళ్లి పనులు, ప్రయాణాలు సాగించి మరో పక్క వేసవి తాపానికి అలసిన మగపెళ్లివారికి తిరిగి ఉత్సాహాన్ని కలిగించేందుకు, ఈ సంప్రదాయాన్ని నెలకొల్పి ఉంటారు.

 

బెల్లపు పానకంలో మిరియాలు, యాలుకలు కూడా వేస్తుంటారు. ఆయుర్వేదం ప్రకారం మిరియాలు, యాలుకలు కూడా జీర్ణశక్తిని వృద్ధి చేస్తాయి. శరీరంలోని మలినాలన్నీ బయటకు పోయేలా తోడ్పడతాయి. వేసవిలో వచ్చే పొడిదగ్గుకి మిరియాలు గొప్ప ఔషధంలా పనిచేస్తే, యాలుకలు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. పానకం గురించి ఇంత చెప్పుకున్నాక వడపప్పు గురించి కూడా ప్రస్తావించి తీరాల్సిందే! పెసరప్పుకి చలవ చేసే గుణం ఉందంటారు. అంతేకాదు! అతి సులభంగా జీర్ణమయ్యే పదార్థాలలో పెసరపప్పు ఒకటి. శరీరంలోని మలినాలను తొలగించేందుకు, బరువు తగ్గించుకునేందుకు ఇప్పడు చాలామంది పాశ్చాత్యులు కూడా పెసరపప్పుతో చేసిన కట్టుని (సూప్) తాగడం మొదలుపెట్టారు. మనం ఆడుతూపాడుతూ తాగే వడపప్పు, పానకాల వెనుకాల ఇంత శాస్త్రం ఉందన్నమాట!

- నిర్జర.