ప్రాణాలు కోల్పోతున్న యువత... మిడ్-నైట్ ఎంజాయ్ మెంట్ తో పెడద్రోవ...

తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం... విచ్చలవిడితనం... క్రమశిక్షణ కరువవడంతో... యువత పెడద్రోవ పడుతోంది. విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. స్పీడ్‌ థ్రిల్స్‌... బట్ కిల్స్‌... అంటూ పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా... యువత మాత్రం... ప్రాణం కన్నా... వేగమే ముఖ్యమంటూ గాల్లో కలిసిపోతున్నారు. అర్ధరాత్రి ఎంజాయ్‌మెంట్‌ పేరుతో మితిమీరిన వేగంతో కార్లను నడుపుతూ గాల్లో కలిసిపోతున్నారు. ఎన్నో ప్రమాదాలు గుణపాఠాలుగా ముందు కనిపిస్తున్నా... మితిమీరిన వేగం... విచ్చలవిడి ప్రవర్తనతో ప్రాణాలు కోల్పోతున్నారు. సేమ్ టు సేమ్‌.... గచ్చిబౌలి బయోడైవర్శిటీ ఫ్లైఓవర్‌ యాక్సిడెంట్‌ స్టైల్లో... జరిగిన మరో ప్రమాదం హైదరాబాద్‌లో కలకలం రేపింది. అతివేగం కారణంగా భరత్‌నగర్‌ బ్రిడ్జిపై కారు గాల్లోకి ఎగిరిపడగా.... ఒకరి ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది.

హైదరాబాద్‌ భరత్‌నగర్‌ బ్రిడ్జిపై జరిగిన కారు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బోరబండ పండిట్ నెహ్రూనగర్‌కు చెందిన ఐదుగురు యువకులు అర్ధరాత్రి కారులో షికారు చేస్తూ ప్రమాదానికి గురయ్యారు. బాలానగర్‌ నుంచి ఎర్రగడ్డకు వస్తుండగా భరత్‌నగర్ బ్రిడ్జి పైనుంచి కారు కిందపడిపోయింది. అయితే, మితిమీరిన వేగం కారణంగా కారు గాల్లో ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో కారును నడుపుతున్న సోహైల్ అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో ఫ్లైఓవర్ కింద ...రోడ్డుపై ఉన్నవాళ్లు తృటిలో తప్పించుకున్నారు. కూరగాయల మార్కెట్లో లోడింగ్ జరుగుతుండగా, భారీ శబ్ధంతో కారు కిందకి వస్తుండటాన్ని గమనించినవాళ్లు పక్కకు తప్పుకున్నారు. దాంతో, భారీ ప్రాణనష్టం తప్పింది. 

భరత్‌నగర్ ఫ్లైఓవర్‌పై కారు ప్రమాదానికి అతివేగమే కారణమని తేలింది. అయితే, ఈవిధంగా కార్లను నడిపేవాళ్ల కారణంగా, వాళ్లు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, ఎలాంటి సంబంధం లేదని అమాయకులు కూడా మరణిస్తున్నారని, గచ్చిబౌలి బయోడైవర్శిటీ ఫ్లైఓవర్ యాక్సిడెంట్‌లో అదే జరిగిందని పోలీసులు గుర్తుచేస్తున్నారు. అయితే, గంటకు 40 కిలోమీటర్ల వేగం మించకుండా కార్లలో నియంత్రణ చేపడితేనే ప్రమాదాలకు అడ్డుకట్టవేయగలమని అంటున్నారు. మరి, ఇది సాధ్యమేనా? అనేది ప్రశ్నార్ధకమే?