సభలో స్పీకర్ హోదాను మరచిన తమ్మినేని...

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీరు చర్చనీయాంశంగా మారింది. గత రెండు రోజులుగా ఆయన ప్రవర్తించిన తీరు పై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చలు నడుస్తున్నాయి. ప్రభుత్వ, విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాల నడుమ స్పీకర్ తమ్మినేని సీతారాం తీరు ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. వరుసగా రెండు రోజులు ఆయన విపక్ష సభ్యులపై విరుచుకుపడ్డారు. స్పీకర్ స్థాయిని సైతం మరిచిపోయి ప్రతిపక్షాల పై ఆగ్రహంతో అరుస్తూ ఊగిపోతున్నారు.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన తమ్మినేని సీతారాం ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు, ఐదు సార్లు టిడిపి తరఫున ఎన్నికై మూడు పర్యాయాలు మంత్రిగా పని చేసిన సుదీర్ఘ అనుభవం కూడా ఆయనకుంది. 2013 లో వైసీపీలో చేరి, 2014 ఎన్నికల్లో ఓడిపోయినా, 2019 లో ఆమదాలవలస నుంచి ఎమ్మెల్యేగా గెలిచి స్పీకర్ అయ్యారు. అయితే స్పీకర్ గా ఆయన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సభలో తెలుగుదేశం సభ్యులకు మాట్లాడేందుకు తగిన అవకాశం ఇవ్వడం లేదన్న ఆరోపణలను ఆయన తరచూ ఎదుర్కొంటున్నారు. మూడు రాజధానుల బిల్లుపై చర్చ సందర్భం గానూ మరుసటి రోజున ఎస్సీ కమిషన్ బిల్లు సందర్భం గానూ ఆయన తీవ్ర అసహనాన్ని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం ఏపీ శాసన సభ సమావేశాలు రెండోవ రోజున ప్రారంభమైనపుడు ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చ జరిగింది. ఈ చర్చకు అడ్డు తగిలినా టిడిపి ఎమ్మెల్యేలు పోడియం వద్దకు దూసుకు వెళ్లి జై అమరావతి అంటూ నినాదాలిచ్చారు. టిడిపి సభ్యులు స్పీకర్ చైర్ ను అవమానిస్తున్నారని ఈ పరిస్థితుల్లో తాను సభ నడిపించలేనని ఆయన ఆగ్రహం చెందారు. విపక్షాలకు ఉన్న సంఖ్యాబలంతో పోలిస్తే తాను అధిక ప్రాధాన్యమిస్తున్నామని అయినా చైర్ ను అవహేళన చేస్తున్నారని అంటూ సభ నుంచి విసురుగా వెళ్లి పోయారు. వాస్తవానికి తమకు సరైన అవకాశం రాని సందర్భాల్లో విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేస్తారు. ఏపీ అసెంబ్లీలో మాత్రం విచిత్రంగా స్పీకర్ బయటకు వెళ్లిపోయారు. 

సోమవారం కూడా సభలో స్పీకర్ తీరు విపక్షాలను ఇబ్బందుల్లోకి నెట్టింది. అసెంబ్లీలో సీఆర్డీఏ రద్దు బిల్లు అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడిన తరువాత ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారం గుట్టు తేల్చాలని భూ కొనుగోళ్ల పై సమగ్ర విచారణ జరిపించి నిజానిజాలు వెలికితీయాలని ముఖ్యమంత్రి జగన్ ను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశించారు. దీనిపై టిడిపి సభ్యులు అభ్యంతరం తెలిపుతూ అలా ఆదేశాలు జారీ చేసే ముందు తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ తో పాటు వైజాగ్ ఇన్ సైడర్ ట్రేడింగ్ పై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తమ వాదన వినకుండా ఏక పక్షంగా ఆదేశాలు జారీ చేయటానికి మీకు ఏమి అధికారముందని స్పీకర్ ను విపక్షాలు ప్రశ్నించగా దీంతో తమ్మినేని మండిపడ్డారు. గట్టిగా ప్రశ్నిస్తున్న అచ్చెన్నాయుడుని ఉద్దేశించి సెన్సాఫ్ హ్యూమర్ ఉందా, ప్రతిపక్ష సభ్యులు హద్దులు దాటుతున్నారు అని అన్నారు. ప్రభుత్వాన్ని ఆదేశించే హక్కు నాకు లేదంటారా, డోంటాక్ రబీష్ అని విరుచుకుపడ్డారు. బొత్సకు మాట్లాడే అవకాశం ఇచ్చి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసే అధికారం తనకు ఉందో లేదో చెప్పాలని అడిగారు. పైగా త్వరలో మంత్రిగా వచ్చి చూపిస్తానంటూ అచ్చెన్నాయుడుకు సవాల్ విసిరారు. పైగా ఏయ్ ఆగవయ్య,సమయం వచ్చినప్పుడు నీ సంగతి చూస్తా అంటూ  అంటూ విపక్ష సభ్యుల పట్ల ఏకవచన సంబోధన అందరినీ ఆశ్చర్యపరిచింది. సభ ప్రారంభం నుంచే స్పీకర్ తమ్మినేని తమ పట్ల అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. మొత్తం మీద స్పీకర్ స్థాయిలో ఉండి సమస్యలను సామరస్యంగా తేల్చాల్సిన తమ్మినేని ఇలాంటి సమస్యలకు తావునివ్వడం సమంజసం కాదని కొందరు రాజకీయ విశ్లేషకుల వాదన.