అమ్మ గారి చెయ్యి

 

 

Vijaya Kumar Ponnada

 

'ఇవాళ చాలా సుధినం అని నేను మనవి చేస్తా వున్నాను. భారతదేశంలోనే అతి పెద్దయిన మా పార్టీ అధ్యక్షురాలికి గుడి కట్టడానికి ఇవాళ శంఖుస్థాపన చేసే భాగ్యం నాకు దక్కింది. ' అని వూపిరి ఓ సారి గట్టిగా పీల్చుకుని, మళ్ళీ మొదలెట్టాడు భజనరావు. 'నిజానికి ఆవిడ గారు మనకి చేసిన సేవలు ఇంతా అంతా కాదు. ఆ మాటకొస్తే ఆవిడ అసలు మనకి ఎందుకు చేయాలీ అని నేను ఈ సభా ముఖంగా మిమ్మల్నందరినీ ప్రశ్నిస్తా వున్నాను? ఆవిడదేమయినా మన పేటా? మన వూరా? మన రాష్ట్రమా? పోనీ మన దేశమా? కాదు ఎక్కడో ఇటలీలో పుట్టి ఇక్కడకొచ్చి మనల్ని వుద్దరిస్తున్నారు. మొన్న యన్నీబీసేంట్ అనే ఆవిడా, నిన్న మథర్ తెరెస్సా, ఇవాళ ఇక ఈవిడా. రేపు ఇక ఎవ్వరూ వుండరని నేను నొక్కి వొక్కాణిస్తున్నను.'


మన దేశానికి వచ్చి, రాజీవుగాంధిగారి మరణాంతరం తిరిగి ఇటలీ వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు, నాలాంటి తమ్ముళ్ళు, అన్నలు, అక్కలూ, చెల్లేళ్ళు ఆవిడకి అడ్డంగా నిల్చుని, మీకు మేమున్నాము, అని చెప్పి వొప్పించి, ఖాళీగా వుండకుండా, ఏదో కాలక్షేపానికి వారు వొద్దంటున్నా అందరం కలసి, పార్టీ అధ్యక్షపదవి ఇచ్చాము. ఇవాళ ఆవిడ అలా పార్టీ కుర్చీకి అత్తుక్కు పోయారంటే ఆవిడ నిరంతర కృషే అని వేరే చెప్పనక్కర్లేదు. గిట్టని వాళ్ళు, విపక్షాల వాళ్ళు ఆవిడకి పదవి కాంక్ష ఎక్కువంటారు. అదే నిజమయితే ఆవిడ ఈనాడు మన్మోహనంగారి స్థానంలో ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చునేవారు. నాకు తెలుసు ఆవిడ ప్రధాని మంత్రి అభ్యర్ధికోసం ఎంత శ్రమ పడ్డారో.' అని కళ్ళలోంచి వచ్చే నీళ్ళని చొక్కాతో తుడుచుకుంటూ, 'ఎన్నికలయ్యాకా ప్రధానిగ ఎవరిని కూర్చోపెట్టాలా అని ఆవిడ చాలా వ్యధ చెందారు. ఒకరోజు ఆవిడ తన డాక్టరు దగ్గరకి వెళ్ళినప్పుడు లోపల నుంచి మాటలు వినిపించాయి. 'లాభంలేదు సింగు గారు. మీరు ఎక్కువ మాట్లాడకూడదు, పైగా వృధాప్యం వల్ల కాస్త చూపు మందగించింది, వినికిడి కూడా తగ్గింది. ఇక రెస్టు తీసుకోండి ' అన్న మాటలు వినిపించాయి. అప్పుడే సింగు గారు చేతిని నోటికి అడ్డంగా పెట్టుకుని, వచ్చే దుఖాన్ని ఆపుకుంటూ, ఇక ఆగలేక పరిగెత్తుకుంటు వెళ్ళిపోయారు. అది చూసిన అమ్మాగారు, వెంటనే 'యూరేఖా ' అని అర్కెమిడిసులా అరచి 'నేను అనుకున్న లక్షణాలున్న ప్రధాన మంత్రి దొరికాడోచ్ ' అని ఆయన వెనకాలే పరిగెత్తుకెళ్ళి, ఆయన్ని పట్టుకుని ప్రధానిని చేసారు ' అన్నాడు భజనరావు. 'మన దేశానికి మన వారే ప్రధాని కావలన్నది ఆవిడా ఆకాంక్ష. ఆవిడ త్యాగనిరతికి ఓ తార్కాణం.'


'ప్రణభ్ ముఖర్జీ గారు రాజీవగాంధీగారితో పడక వేరే వాళ్ళ వూరెళ్ళిపోయి ఓ కుంపటి కొనుక్కుని, దానికి 'రాష్ట్రీయ సమాజవాదీ కాంగ్రెస్ ' అని పెట్టుకుని, స్వయం పాకం మొదలెట్టారు. అప్పుడు సొంతగా చెయ్యి కాల్చుకునే ఆయన్ని చూసి సదరు రాజీవ్గాంధీగారే జాలి పడి 'వేరే కుంపటి ఎందుకు, 'చెయ్యి ' కాలుతుంది, మాతో చెయ్యి కలిపేయండి ' అనేసరికి, ఆయన కుంపటి ఆర్పెసి, వచ్చి మళ్ళీ కాంగ్రెస్లో కలసి పోయారు. మరి అలా సమయానికి వచ్చి చేరినా ఆతరువాత, నాకు ఇది కావాలీ అది కావాలీ అని పెచీ పెట్టలేదు. అది చూసి అమ్మగారు తాను 'భారతరత్న ' తీసేసుకోగల స్థితిలో వున్నా, అలాకాదని ప్రణబ్గారికి, 2008లో 'పద్మ విభూషణ్ ' బిరుదుని ఇచ్చేసారు. 'ఆతరువాత, ప్రధాని పోస్టు ఇవ్వరూ అని అడిగితే, చస్! వల్ల కాదు. కావస్తే రాష్ట్రపతి పదవి తీసేసుకోండి ' అని త్యాగం చేసారు ' అని మళ్ళీ చొక్కతో కళ్ళనీళ్ళు తుడుచుకుని, చొక్క తడిసిపోయిందని అది తీసేసి, మరో చొక్క వేసుకున్నాడు, భజనరావు. 


'ఇవాళ కూడా ఆవిడ చాలా సాదా సీదాగానే వున్నారు. వాళ్ళబ్బాయి పదవిలేక, చేసేది ఏమీలేక, మీటుంగులు గట్రాలు పెట్టుకుని, వచ్చిన వారికి పలాయన వేగం గురించి మరియు ప్రయాగ శాస్త్రములో పాటాలు చెప్పి, కాలక్షేపం చేస్తున్నా అతనికి ప్రధాన మంత్రి పదవి ఇవ్వటానికి ససేమిరా వొప్పుకోటల్లేదు. మళ్ళీ గిట్టని వాళ్ళు 'అబ్బే అదేంలేదు, అతగాడిది ఇంకా కుర్ర తనం. పైగా అతన్ని ప్రధానిని చెయ్యలంటే చాలా కష్టం. అతను చెప్పింది వినిపించుకోడు తప్ప, చెముడు లేదు. ముందు చూపు లేదు తప్ప, అతని చూపు బానే వుంది, ఇక మాట్లాడం మొదలెడితే ఆపడు ' అని అంటారు.
 

ఈ మధ్యన ఓ వెబ్సైట్ వాళ్ళూ ఈవిడగారికి 12 వేల పైచిలుకు కోట్లున్నాయని రాసి పారేసారు. అయితే కొంచం అటూ ఇటుగా అన్నారు. దాంటో అమ్మగారు కుమిలి పోయారు. 'ఆ దిక్కుమాలినాళ్ళకి లెక్కలు రావా? సరిగ్గ లెక్కెట్టి చెప్పమను ' అని కోప్పడ్దరు. దాంతో వాళ్ళూ నాలిక్కరుచుకుని, మళ్ళీ లెక్కలెట్టడం మొదలెట్టారు. ఈ సారి గిట్టని వాళ్ళు 'నిజమే వాళ్ళకి బుద్దిలేదు. సరిగ్గ లెక్కెట్టకుండా చెప్పేసారు. వాళ్ళు చెప్పినదానికంటే ఇంకా చాలా ఎక్కువే వుంటుందన్నారు.'


'ఏది ఏమయినా మన దేశం చాలా గొప్పదేశం. లేక పోతే ఆంగ్లేయులని తరిమి కొట్టి, ఇటలీ వాళ్ళకి పీటేస్తారా చెప్పండి? ఈవిధంగా మనం ప్రపంచంలోనే ఓ కొత్త వొరవడికి నాంది పలికాము. ఏ దేశం వారయినా, ఏ దేశంలోనయినా తమ సత్తా చూపొచ్చని, దానికి మా అమ్మగారి తరువాతే ఎవరినయిన చెప్పుకోవాలి. ఆవిడని నేను కోరుకునేది ఒక్కటే. ఇలా మన దేశంతో ప్రారంబించినా ఆవిడ ప్రస్థానం, పక్క దేశాలకి కూడా పాకి, వచ్చే పుట్టిన రోజుకి ఆవిడ మరో మాలుగు దేశాలకి అధిపత్యం వహించాలని ఈ సభా ముఖంగా ఆవిడకి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. పక్క దేశాల్లోను ఇలా ఆవిడకి గుడి కట్టే అదృష్టం నాకే దక్కాలని, ఇప్పుడు కట్టబోయే గుడి తాలూకా దేవతని వేడుకుంటున్నాను.' అని కళ్ళలో నీళ్ళు తుడుచుకున్నాడు. ఈసారి అవి ఆనందంతో వచ్చినవిలెండీ!