ఫ్లోలో మోడీని తిట్టిన సోము.. తప్పు పట్టిన టీడీపీ..

 

బీజేపీ ఎమ్మెల్సీ వీర్రాజు గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్యకాలంలో టీడీపీ నేతలపై తరుచూ విమర్శలు గుప్పిస్తూ ఫేమస్ అయిపోయారు. అయితే రెండు మూడు రోజుల నుండి సైలెంట్ గా  ఉన్న వీర్రాజు కు మీడియా ముందు కనిపించకపోవడంతో నిద్రపట్టినట్టు లేదు. అందుకే మీడియా ముందుకు వచ్చారు. ఇక మీడియా ముందు కనిపిస్తే చాలు తన నోరు కంట్రోల్ లో ఉండదని తెలుసు కదా. మీడియా ముందు కనిపించాలన్న ఆత్రం... ఏదో ఒక రకంగా ఎవరో ఒకర్ని నిందించి ఫేమస్ అయిపోవాలన్న తొందర. అదే ఇప్పుడు ఆయనకు చిక్కులు తెచ్చి పెట్టింది. ఎప్పటిలాగే విశాఖలో టీడీపీ ఎమ్మెల్యేలు మోడీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల గురించి ప్రస్తావించారు. ఇక టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. ఆ కోపంలోనే ప్రధాని మోడీపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ వర్గానికి చెందిన ప్రధాని, నీచ కులానికి, గాండ్ల కులానికి చెందిన మోడీ దేశానికి ఎంతో చేస్తున్నారని.. ఆయనపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం బాధాకరమని చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడే వీర్రాజు గారు దొరికిపోయారు. ఒక కులాన్ని నీచ కులమని ఎలా సంబోధిస్తారని టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్  నిలదీశారు. దానికి రాజుగారు మోడీని నీచకులమని కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యానించారని దానినే గుర్తు చేశానని ఏదో కవరింగ్ ఇవ్వడానికి ప్రయత్నించారు. అయితే అవన్నీ వర్కవుట్ అవ్వవని.. అధిష్టానం వరకూ మ్యాటర్ వెళితే పార్టీలో ఉంచడం కష్టమని భావించి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. టీడీపీ ఎమ్యేల్యేలు ఫ్లెక్సీలు పెడితే... మణిశంకల్ అయ్యర్ ను గుర్తుచేయడం ఏంటో రాజుగారికే తెలియాలి.

 

మరి గతంలో మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలను మోడీ గుజరాత్ ప్రచారంలో ఎలా వాడుకున్నారో అందరికీ తెలిసిందే. ఇక కొత్తగా రాజ్యసభకు వెళ్లిన ఏపీకి చెందిన జివిఎల్ నరసింహరావు అయితే ఏకంగా పెద్ద డ్రామానే చేశారు. దేశ ప్రధానిని ఇలా అనడం చాలా బాధాకరమైన విషయం అని.. అందుకు తాను చాలా వ్యథ చెందుతున్నట్టు తెలిపారు. కాసేపు మౌనం కూడా పాటించారు. ఇంత డ్రామా చేసిన ఆయన.. ఇప్పుడు రాజు గారి మాటలకు ఏం చేస్తారో చూద్దాం.. మరి దీని ఎఫెక్ట్ రాజుగారిపై పడుతుందో.. లేదా మన పార్టీవాడే కదా అని లైట్ తీసుకుంటారేమో చూద్దాం..