మూడు రాజధానులపై... వైసీపీ నేతల్లోనూ వ్యతిరేకత..!

కరవమంటే కప్పకు కోపం... విడవమంటే పాముకు కోపం... అన్నట్లుగా వైసీపీ, టీడీపీ ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తల పరిస్థితి. ఎందుకంటే, మూడు రాజధానుల ఏర్పాటు చేస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరవమంటే కప్పకు కోపం... విడవమంటే పాముకు కోపమన్నట్లుగా ఉందని కిందిస్థాయి నేతలు వాపోతున్నారు. విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటును వైసీపీ, టీడీపీల్లో కొందరు స్వాగతిస్తుంటే... మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. రాజధాని ఒకటున్నా... మూడున్నా... ముప్పై ఉన్నా... తమకు ఒరిగేదేమీ ఉండదని సామాన్య ప్రజలు భావిస్తున్నారని కిందిస్థాయి వైసీపీ నేతలు అంటున్నారు. ప్రభుత్వం తమకేమిచ్చిందని మాత్రమే ప్రజలు చూస్తున్నారే తప్ప.... ఈ రాజధానుల గొడవను వాళ్లు పట్టించుకోవడం లేదని విశాఖ వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే, ప్రభుత్వం తాను తీసుకోబోయే నిర్ణయాలపై కిందిస్థాయి నేతల అభిప్రాయాలు కూడా తీసుకుంటే బాగుంటుందని అంటున్నారు. అధికార పార్టీయైనా, ప్రతిపక్ష టీడీపీయైనా... అధిష్టానం నుంచి వచ్చే ఆదేశాలను పాటిస్తూ కార్యక్రమాలను నిర్వహించడం తప్ప... కిందిస్థాయి లీడర్లు ఇంకేం చేయగలరని వాపోతున్నారు. మూడు రాజధానుల ఏర్పాటు తమ పార్టీలోనూ చాలామందికి ఇష్టంలేదని, కానీ అధిష్టానం ఆదేశాల మేరకు ర్యాలీలు చేయడం, సీఎం జగన్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నామని వైసీపీ ద్వితీయశ్రేణి నేతలు చెబుతున్నారు. 

ఇక, మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రతిపక్ష టీడీపీ నేతల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని, అది అమరావతి మాత్రమే ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు అంటుంటే, విశాఖ ద్వితీయశ్రేణి తెలుగుదేశం నేతలు మాత్రం... వైజాగ్ ను పరిపాలనా రాజధానిగా బలంగా సమర్ధిస్తున్నారు. అమరావతి రైతుల ఆందోళనలపై చర్చించుకుంటున్నారే తప్ప, ఎవరూ సమర్ధించడానికి ముందుకు రావడం లేదు. ఒకవేళ రాజధాని రైతుల ఆందోళనల్ని సమర్ధిస్తే... ఉత్తరాంధ్ర ద్రోహులుగా వైసీపీ నేతలు విమర్శిస్తారనే భయం కూడా విశాఖ టీడీపీ నేతలను వెంటాడుతోంది. అదే సమయంలో మూడు రాజధానులను సమర్ధిస్తే... పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించినట్లు అవుతుందని భయపడుతున్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయడం వల్ల ఉత్తరాంధ్ర ఎంతోకొంత అభివృద్ధి చెందుతుందని టీడీపీ శ్రేణులు కూడా భావిస్తున్నాయి. విశాఖతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు అంటున్నారు. 

అయితే, మూడు రాజధానుల నిర్ణయం కొన్ని ప్రాంతాలకు అనుకూలంగా... మరికొన్ని ప్రాంతాలకు వ్యతిరేకంగా ఉన్నా... తమతమ పార్టీల నిర్ణయాలపై అభ్యంతరం చెప్పలేని పరిస్థితి ఉందంటున్నారు. మొత్తంమీద మూడు రాజధానులపై అటు అధికార వైసీపీ... ఇటు ప్రతిపక్ష టీడీపీ నేతల పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్లుగా ఉందని చెబుతున్నారు.