ఎడమ చేతి వాటం ఎందుకు ఉంటుంది?

మహాత్మాగాంధి గురించి చాలామందికి చాలా విషయాలు తెలుసు. కానీ ఆయనది ఎడమ చేతి వాటం అన్న విషయం తెలుసా! సచిన్‌ టెండుల్కర్‌ని క్రికెట్‌ ప్రపంచం దేవుడిగా ఆరాధిస్తుంది. ఆయన కుడిచేతితో బ్యాటింగ్‌ చేసినా... స్వతహాగా ఎడమచేతి వాటం ఉన్న మనిషన్న విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఎడమచేతి వాటం ఉన్న ప్రసిద్ధుల గురించి చెప్పుకోవడం మొదలుపెడితే... ఆ జాబితా చాలా పెద్దదిగానే ఉంటుంది. కానీ అలా కొందరికి మాత్రమే ఎడమచేతి వాటం ఉండటం వెనక కారణం ఏమిటి?


మన నాగరికత అంతా కుడిచేతి వాటానికి అనుకూలంగా కనిపిస్తుంది. కారు దగ్గర నుంచీ కత్తెర దాకా ప్రపంచం అంతా కుడిచేతివారికే అనుకూలంగా ఉంటుంది. ఎడమచేతి వాటం ఉన్నవారిని పరిశుభ్రత లేనివారుగానూ, వింతమనుషులుగానూ భావించడమూ కనిపిస్తుంది. ఇప్పుడంటే ఫర్వాలేదు కానీ.... ఒకప్పుడు ఎడమచేతివారిని మంత్రగాళ్లుగా, సైతానుకి ప్రతిరూపాలుగా భావించేవారట. అలా ఎడమచేతి వాటం ఉన్నవారిని తగలబెట్టిన సందర్భాలు కూడా చరిత్రలో ఉన్నాయని అంటారు.


ఇంగ్లీషులో sinister అనే పదం ఉంది. దుష్టబుద్ధి కల మనిషి అని ఈ పదానికి అర్థం. అసలు ఈ పదమే sinistra అనే లాటిన్ పదం నుంచి వచ్చిందట. అంటే ఎడమచేయి అని అర్థం. దీనిబట్టి జనం ఎడమచేతి వాటం ఉన్నవారిని ఎలా అపార్థం చేసుకునేవారో గ్రహించవచ్చు. హిందూ సంప్రదాయంలో కూడా తంత్రాలతో కూడిన ఆచారాలను ‘వామాచారం’ అని పిలవడం గమనించవచ్చు.


ఎడమచేతి వాటానికి కారణం జన్యువులు అన్న అనుమానం ఎప్పటి నుంచో వినిపిస్తున్నదే! దీనికి కారణం అయిన జన్యువులని ఆ మధ్య కనిపెట్టామని కూడా శాస్త్రవేత్తలు ప్రకటించారు. PCSK6 అనే జన్యువులో మార్పు కారణంగానే కొందరు ఎడమచేతి వాటంతో పుడతారని తేల్చారు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడే... అతనిది కుడిచేతివాటమా, ఎడమచేతివాటమా అన్నది పసిగట్టేయవచ్చని చెబుతున్నారు.


ఎడమచేతి వాటం ఉన్నవారు ఈ ప్రపంచంలో పదిశాతమే ఉంటారు. ఒకవేళ జన్యుపరమైన కారణాలు ఉంటే ఈ నిష్పత్తి సరిసమానంగా ఉండవచ్చు కదా అన్న అనుమానం రావచ్చు. దీనికి మన నాగరికతే కారణం అంటున్నారు. మనిషి సంఘజీవి. సాటి మనుషులతో కలిసి పనిచేస్తేనే అతని పని జరుగుతుంది, సమాజమూ ముందుకు నడుస్తుంది. ఈ క్రమంలో అతను తయారుచేసుకునే పరికరాలు అన్నీ కూడా కుడి చేతివాటం వారికే అనుకూలంగా ఉండేలా చూసుకున్నాడు. అలా నిదానంగా ఎడమచేతివాటాన్ని నిరుత్సాహపరుస్తూ వచ్చింది సమాజం. దాంతో క్రమంగా ఎడమచేతి వాటం ఉండేవారి సంఖ్య తగ్గిపోయింది. ఈలోగా భాషకి లిపి కూడా మొదలైంది. ఆ లిపి కూడా కుడిచేతి వాటంవారికే అనుకూలంగా రావడంతో... కుడిచేతివారిదే పైచేయిగా మారిపోయింది.


ఈ ప్రపంచం అంతా కుడిచేతివారికే అనుకూలంగా ఉంటుందన్న విషయంలో అనుమానమే లేదు. కానీ ఇది ఒకరకంగా ఎడమచేతివారికి అదృష్టం కూడా! మిగతావారికి భిన్నంగా ఉండటం వల్ల, కొన్ని పోటీలలో ఎడమచేతి వాటం గలవారికి అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణకు బేస్‌బాల్‌ ఆటనే తీసుకోండి. బేస్‌బాల్ ఆటగాడికి కనుక ఎడమచేతి వాటం ఉంటే అతని ఆట తీరుని పసిగట్టడం, శత్రువులకి అసాధ్యంగా మారిపోతుంది. ఈ తరహా లాభాన్ని negative frequency-dependent selection అంటారు. పైగా ఎడమచేతి వాటం ఉన్నవారు ఇతరులకంటే తెలివిగా ఉంటారనీ, వీరిలో సృజన ఎక్కువగా ఉంటుందని కూడా అంటారు.