ఒకేసారి ఎన్నికలకు ఈసీ " సై "

విడతల వారీగా కాకుండా దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలను నిర్వహించాలని ప్రధాని నరేంద్రమోడీ ఇటీవలి కాలంలో తన మనసులోని మాటను బయటపెట్టారు. తద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనం ఆదా అవ్వడమే కాకుండా..ఎంతో విలువైన సమయం కూడా ఆదా అవుతుందని ఆయన అభిప్రాయం. దీనిపై దేశంలోని మేధావులు, స్వచ్ఛంధ సంస్థలు, పలు పార్టీల నేతల హర్షం వ్యక్తం చేశారు.

 

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ప్రతి ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ఉంటుంది. మరి 29 రాష్ట్రాలతో పాటు లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనా..? ఏ పార్టీ అయినా ఐదేళ్ల పాటు అధికారంలో ఉండాలనే అనుకుంటుంది.. అంతేకానీ గడువు తీరకుండా అధికార కుర్చీని దిగడానికి ఎవరైనా ఇష్టపడతారా..? అయితే ప్రధాని మాత్రం ఇందుకు అవసరమైన రాజకీయ, రాజ్యాంగ, పాలనాపరమైన కసరత్తు వేగం చేశారు. సరిగ్గా ఇదే సమయంలో తాము ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని తెలిపింది కేంద్ర ఎన్నికల సంఘం.

 

వచ్చే ఏడాది సెప్టెంబర్ తర్వాత దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగలమని ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ వెల్లడించారు. ఈ ప్రక్రియకు కావాలసిన వివరాలు, ఈవీఎంలు, డబ్బు గురించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించామన్నారు. ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించాలంటే 40 లక్షల ఎన్నికల పరికరాలు కావాలి..వీవీపాట్ కోసం రూ.3,400 కోట్లు, ఈవీఎంల కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు అవుతుందని రావత్ అన్నారు. తమ అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఇందుకు సంబంధించి నిధులు అందించడంతో తమ పని ప్రారంభించామని.. అదనపు పరికరాల కోసం ఆర్డర్లు ఇచ్చామని.. సెప్టెంబర్ 2018 నాటికి అన్ని పరికరాలు అందుబాటులోకి వస్తాయని, అప్పుడు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు తాము పూర్తి స్థాయిలో సిద్ధమని తెలిపారు.