భారత్ ను ఈశాన్య రాష్ట్రల నుంచి వేరు చేసే కుట్ర చేస్తోన్న చైనా!

 

ప్రస్తుతం ఒక వీడియో సోషల్ నెటవర్క్ లలో బాగా వైరల్ అవుతోంది. అందులో మన భారత జవాన్లు చైనీస్ సోల్జర్స్ ని తోసేస్తూ కనిపిస్తున్నారు. తిరిగి వెనక్కి వెళ్లమని విజ్ఞప్తులు చేస్తున్నారు. అయినా మొండిగా చైనీస్ జవాన్లు ముందుకు దూసుకొస్తున్నారు. ఇలాంటివి మన ఇంకో శత్రువు పాకిస్తాన్ విషయంలో ఎప్పుడూ చూడం. పాకీ సైనికులతో నేరుగా కాల్పులే. పక్క దేశం ఈ మధ్య కాలంలో ఎన్నిసార్లు కాల్పుల విరమణకి తెగబడితే మన వారూ అన్ని సార్లు గట్టిగా జవాబిస్తున్నారు. కాని డ్రాగన్ తో ప్రత్యక్ష హింస భారత్ ఉద్దేశం కాదు. చైనాకి కూడా ఇప్పటికిప్పుడు ఇండియాతో కాల్పుల కయ్యం మొదలు పెట్టాలని లేదు. అయినా కూడా రెచ్చిగొట్టి ఆనందిస్తోంది. ఎందుకు?

 

సాధారణంగా చైనాతో మనకు చిరాకు పుట్టించే సంఘటనలు కొత్తేం కాదు. 1962లో భారత్ డ్రాగన్ చేతిలో ఓటమిపాలైంది. అప్పట్నుంచీ మన సైనికులకి ఆ దేశమంటే పాకిస్తాన్ కన్నా ఎక్కువ కోపం. అయినా కూడా కాలం గడుస్తున్న కొద్దీ వ్యాపార, వాణిజ్యాల పరంగా చైనా, ఇండియా దగ్గరయ్యాయి. ఇప్పుడు మన వల్ల చైనాకి ఎన్నో బిలియన్ డాలర్ల లాభం. అయినా అనుక్షణం పాకిస్తాన్ ను సపోర్ట్ చేసే చైనీస్ ప్రభుత్వాలు తమ బుద్ధి పోనిచ్చుకోవటం లేదు. ఓ సారి అరుణాచల్ ప్రదేశ్ వద్ద మరో సారి మరో చోటా చికాకు పరుస్తూనే వున్నాయి. ఏ భూభాగం చూస్తే అది నాదిననే దురాక్రమణ మనస్తత్వం చైనాకు అన్ని దేశాలతో పరిపాటి. ఇప్పుడు ఆ డ్రాగన్ కన్ను భూటాన్ భూ భాగంపై పడింది. అది భారత్ కి కూడా ముప్పుగా పరిణమించే ప్రమాదం వుండటమే ఇప్పుడు ఇండియన్ ఆర్మీకి చైనా సైనికుల్ని అడ్డుకునేలా చేస్తోంది!

 

ఇండియా, చైనా, భూటాన్ ఒక చోట కలిసే కీలక ప్రాంతం డోకా లా. ఇది ప్రస్తుతం భూటాన్ ఆధీనంలో వుంది. ఆ దేశంలో భాగమైన డోకా లా వద్ద ఓ రోడ్డు వేయటానికి ప్రయత్నించింది చైనా. దాన్ని భూటాన్ తరుఫున అడ్డుకుంది మన సైన్యం. భూటాన్ కు అవసరమైనప్పుడు సైనిక సహాయం అందించటం రెండు దేశాల మధ్యా ఒప్పందంలో భాగమే. కాకపోతే, చైనా ఎందుకని ఇండియా, భూటాన్ లతో కయ్యం పెట్టుకుని మరీ ఓ రోడ్డు వేయాలని చూస్తోంది? దాని వెనుక పెద్ద కుట్రే వుంది!

 

డోకా లా అనే ప్రాంతంలో చైనా రోడ్డు వేస్తే భారత్ లోని సిలిగురి కారిడార్ మీద దాడి చేయటం ఆ దేశ సైన్యానికి ఈజీ అయిపోతుంది. సిలిగురి కారిడార్ అంటే బెంగాల్ రాష్ట్రంలోని అత్యంత కీలకమైన ప్రాంతం. ఈ ప్రాంతం వల్లే బెంగాల్, అసోమ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం లాంటి ఈశాన్య రాష్ట్రలతో సంబంధాలు కొనసాగిస్తుంది. అంటే సిలిగురి కారిడార్ ఎప్పుడైనా మూతపడితే… బెంగాల్ తో సహా మిగతా భారతదేశం మొత్తం ఈశాన్య రాష్ట్రలతో సంబంధాలు తెంచుకోవాల్సిందే! మనం నార్త్ ఈస్ట్ స్టేట్స్ లోకి ఇక వెళ్లలేమన్నమాట. ఈ కారణంతోనే డోకా లా దాకా రోడ్డు వేసుకుని ఆర్మీని అక్కడి దాకా తీసుకొచ్చి కూర్చోబెట్టాలని చైనా చూస్తోంది! అవసరమైనప్పుడు నేరుగా సిలిగురి కారిడార్ మీద బాంబు వర్షం కురిపించి ఈశాన్య భారతదేశాన్ని, మిగతా భారతదేశంతో విడదీయాలని దురాలోచన చేస్తోంది.

 

చైనా కుట్రల్ని ముందే పసిగట్టిన భూటాన్, ఇండియా కలిసి బీజింగ్ ను ఎదుర్కొంటున్నాయి. అయినా కూడా తనకున్న సైనిక బలంతో చైనా ఒక విధంగా విర్రవీగుతుందనే చెప్పొచ్చు. బెదిరించే ధోరణిలో కయ్యానికి కాలుదువ్వుతోంది. మొన్నీ మధ్య చైనా 1962మరిచిపోవద్దని కూడా భారత్ ను హెచ్చరించింది. అందుకు రక్షణ మంత్రి జైట్లీ ఇప్పుడు 1962నాటి ఇండియా లేదని గట్టిగా జవాబిచ్చారు. మరి ఇలా మాటకు మాట, కన్నుకు కన్ను అన్నట్టు సాగుతోన్న ఇండియా, చైనా సంబంధాలు యుద్ధం దాకా వెళతాయా? సమీప భవిష్యత్ లో అలాంటి సూచనలు కనిపించటం లేదు. కాని, ఇండియా అమెరికాకు దగ్గరవ్వటం , పాకిస్తాన్ ను అంతకంతకూ బలంగా ఢీకొడుతుండటం డ్రాగన్ కు నచ్చటం లేదు. అదీ కాక ఇప్పుడు ఆసియాలో చైనాని ధిక్కరించగలిగేది కేవలం ఇండియా మాత్రమే. అందుకే చైనాకు ఇండియా అంటే ఉలుకు ఎక్కువ. భారత్ కూడా అదే రీతిలో ఎప్పటికప్పుడు చైనా కుట్రల్ని తిప్పుకొడుతూ వుండాలి. ఎందుకంటే, పాక్ సంగతి మనం పూర్తిగా తేల్చుకునే దాకా చైనాతో ఎలాంటి యుద్ధాలకు వెళ్లకపోవటమే ఉత్తమం కాబట్టి…