విజయవాడ నడిబొడ్డున ఆ భూములను లీజుకెందుకిచ్చారు?

బెజవాడ కనకదుర్గ ఆలయ భూముల వ్యవహారంపై రగడ నడుస్తోంది. నగర నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన స్థలాన్ని సిద్ధార్ధ విద్యాసంస్థలకు కారుచౌకగా ఎలా కట్టబెడతారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. సుప్రీంలో కేసు నడుస్తుండగా, 33ఏళ్లకు లీజు పొడిగించడంపై అసెంబ్లీలో ప్రతిపక్ష వైసీపీ నిలదీసింది. 

 

సిద్ధార్ధ కాలేజీకి ఇచ్చిన ఆలయ భూముల విలువ ఎకరాకు 70 కోట్లు ఉందని, అందువల్ల ఏటా ఎకరాకు కనీసం కోటి రూపాయలైనా ఆలయానికి ఆదాయంగా రావాలని జగన్ డిమాండ్ చేశారు. 2006లో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధార్థ భూముల లీజును రద్దు చేస్తే, ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందని, ఇలాంటి సమయంలో ఉన్నఫళంగా 33ఏళ్లకు లీజును ఎలా పొడిగిస్తారని జగన్‌ ప్రశ్నించారు. జగన్‌ ప్రశ్నలకు సమాధానమిచ్చిన దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు.... అమ్మవారి ఆలయ భూముల్ని అప్పనంగా ఇవ్వలేదనీ, ఎకరా లీజును లక్షన్నరకు పెంచినట్లు తెలిపారు.

 

అయితే దేవాదాయశాఖ భూములను కాపాడాల్సిన ప్రభుత్వమే, అప్పనంగా తమకు నచ్చినవారికి ఇష్టారాజ్యంగా కట్టబెట్టడాన్ని కాంగ్రెస్‌‌, వామపక్ష నేతలు తప్పుబడుతున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ భూములపై అసెంబ్లీ సాక్షిగా మరోసారి చర్చ జరగడంతో.... సిద్ధార్థ భూముల లీజు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. అయితే వందల కోట్ల విలువైన భూముల్ని అప్పనంగా కట్టబెడుతున్నారని టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా, తెలుగు తమ్ముళ్లు మాత్రం లైట్‌ తీస్కుంటున్నారు.