పేదలకు మరింత పేదరికం.. కుబేరుల ఆస్తి డబుల్ ! కరోనా ప్రభావంపై షాకింగ్ సర్వే  

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించింది. అన్ని రంగాలను చిన్నాభిన్నం చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. కరోనా దెబ్బకు పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. మరికొన్ని దేశాలు తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయాయి. అగ్ర దేశాలు సైతం ఫైనాన్షియల్ క్రైసిస్ ఎదుర్కొన్నాయి. అయితే కరోనా మహమ్మారి ప్రభావంపై తాజాగా విడుదలైన ఓ రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. కరోనా మహమ్మారి అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసినా.. ప్రపంచ కుబేరులకు మాత్రం కలిసి వచ్చిందట. కరోనా కాలంలో కుబేరుల సంపాదన మరింత పెరిగిందని.. అదే సమయంలో పేదలు మరింత పేదలుగా మారిపోయారని తేలింది. 

కరోనా ప్రభావంపై తాము నిర్వహించిన సర్వేలను ఆక్స్ ఫామ్ గ్రూప్ స్విట్జర్లాండ్ లో జరుగుతున్న దావోస్ సమ్మిట్ లో విడుదల చేసింది. విద్య, ఆరోగ్యం, వైద్య రంగాల్లో లక్షాధికారులుగా ఉన్న వారు వ్యాపారులు.. కరోనా మహమ్మారి తర్వాత  కోటీశ్వరులుగా మారిపోయారని ఆ స్పష్టమైంది. ప్రజలంతా మరింత మెరుగైన ఆరోగ్య జీవనాన్ని కోరుకోవడమే ఇందుకు కారణమని  తెలిపింది.  ఆక్స్ ఫామ్ గ్రూప్ ఆ నివేదిక ప్రకారం కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత  అంటే మార్చి 18 నుంచి డిసెంబర్ 31 మధ్య ప్రపంచ బిలియనీర్ల సంపద 3.9 ట్రిలియన్ డాలర్ల వరకూ పెరిగిందట. టాప్ 10 అత్యధిక ధనవంతుల సంపద 540 బిలియన్ డాలర్లు పెరిగిందని వెల్లడైంది. 

కరోనా సమయంలో కుబేరులు మరింత కుబేరులు కాగా..  కోట్లాది మంది పేదలు మరింత పేదలుగా మారారని ఆక్స్ ఫామ్ గ్రూప్ సంస్థ తెలిపింది. కరోనా కాటుకు ప్రపంచంలోని పేదల జనాభా 20 నుంచి 50 కోట్ల వరకూ పెరిగిందని  అంచనా వేసింది. కరోనా మహమ్మారి ప్రపంచంలోని అత్యధికులపై ప్రభావం చూపిందని.. రోజుకు కేవలం 2 నుంచి 10 డాలర్ల మధ్య వెచ్చిస్తూ జీవనం గడుపుతున్న వారిపైనే ఈ ప్రభావం అధికంగా ఉందని ఆ సర్వేలో వెల్లడైంది. వాణిజ్య రవాణా వ్యవస్థలు నిలిచిపోయిన వేళ, వీరి జేబుల నుంచి ఎన్నో వందల కోట్లు ఆవిరై పోయాయని ఆక్స్ ఫామ్ అంచనా వేసింది.