మా గ్రామానికి రోడ్డు వేయకుంటే ఒడిశాలో కలిసిపోతాం!

తమ గ్రామానికి రోడ్డు వేయకుంటే ఒడిశాలో కలిసిపోతామని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు గ్రామస్థులు తేల్చిచెప్పిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. విజయనగరం జిల్లా సాలూరు మండలం గిరిశిఖరంలోని కొదమ గ్రామ గిరిజనులు మంగళవారం ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఇంటికి తరలివచ్చారు. గత సెప్టెంబర్‌ 9న తమ గ్రామానికి వచ్చినప్పుడు 70 రోజుల్లో పట్టుచెన్నారు- చింతచెట్టు జంక్షన్‌ నుంచి కొదమకు రోడ్డు వేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. హామీ ఇచ్చి మూడు నెలలు దాటినా ఇంకా రోడ్డు పనులు ప్రారంభం కాలేదని, ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. తమ గ్రామం పక్కన ఉన్న ఒడిశా గ్రామాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు వేసిందని తెలిపారు. రోడ్డు వేయకుంటే తాము కూడా ఒడిశాలో కలిసిపోతామని తేల్చిచెప్పారు. వారితో ఎమ్మెల్యే చర్చలు జరిపారు. రోడ్డు పని ప్రారంభానికి అటవీశాఖ అనుమతి రాలేదని, అనుమతి రాగానే రోడ్డు నిర్మించి.. కొదమకు వస్తానని ఆయన సర్దిచెప్పడంతో గ్రామస్థులు శాంతించారు.